అయోధ్య రామమందిరం నిర్మాణంపై అమిత్‌ షా కీలక ప్రకటన

5 Jan, 2023 20:08 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. జనవరి 1, 2024 అయోధ్య రామాలయాన్ని ప్రారంభించనున్నట్లు అమిత్‌ షా తెలిపారు.

గురువారం త్రిపురలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి రామ మందిర నిర్మాణ కేసును కాంగ్రెస్‌ కోర్టుల్లో అడ్డుకుంటూ వస్తోంది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై సుప్రీం కోర్టు అనుమతితో నిర్మాణం ప్రారంభమైంది' అని అమిత్‌ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా రామమందిర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

కాగా, మందిరం కనీసం వెయ్యేళ్లదాకా చెక్కుచెదరకుండా ఉండేలా పునాదులను సువిశాలంగా, భారీగా నిర్మిస్తున్నారు. మందిర నిర్మాణానికి దాదాపు 9 లక్షల క్యూబిక్‌ అడుగుల మక్రానా మార్బుల్‌ రాళ్లు వాడుతున్నారు. ప్రధానాలయ నిర్మాణంలో గులాబీ, గర్భాలయానికి, ఫ్లోరింగ్‌కు తెల్ల రాయి వాడుతున్నారు.  మందిరానికి దారితీసే మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.

చదవండి: (యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు