గుదిబండ.. ‘అప్పు’డే!.. పార్లమెంట్‌ సాక్షిగా వాస్తవాలు మరోసారి వెలుగులోకి 

1 Aug, 2023 02:07 IST|Sakshi

టీడీపీ దిగిపోయే నాటికి రాష్ట్రంపై రుణ భారం రూ.2,64,451 కోట్లు

ఇప్పుడు నాలుగేళ్లలో రూ.1,77,991 కోట్లే

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు 

లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై టీడీపీతో పాటు దాని అనుబంధ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో మరోసారి తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. 2019 నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు అప్పులుండగా 2023 మార్చి నాటికి రూ.4,42, 442 కోట్లకు చేరినట్లు తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అసెస్‌ చేస్తోందా? 2019 మే నుంచి ఏపీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? ఆర్థిక పరిస్థితిని అంచనా వేశారా?..’’ అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు వ్యవహ రిస్తోందని తేల్చి చెప్పారు. ద్రవ్యలోటు తగ్గింపు, వివేకంతో కూడిన రుణ నిర్వహణ విధానాలకు  అనుగుణంగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో సుస్థిరత, పారదర్శకతను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎంను అసెంబ్లీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులను, ఆర్ధిక పరిమితులను అమలు చేస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం పరిశీలన చేస్తూ ఉంటుందని వివరించారు. 

కాకి లెక్కలతో పరిపాటిగా..
టీడీపీ దుష్ప్రచారానికి నిత్యం వంత పాడుతున్న ఎల్లో మీడియా అప్పులపై తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో మరోసారి తేటతెల్లమైంది. ఒకసారి రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, మరోసారి రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో కథలు అల్లటం ఎల్లో మీడియాకు రివాజుగా మారింది. ఈ విష ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నా రహస్యంగా అప్పులను దాచారనే విధంగా ఎల్లో మీడియా అవాస్తవాలను వండి వారుస్తోంది. పరిమితులకు లోబడే అప్పులు తీసుకుంటున్నామని, టీడీపీ హయాంతో పోలిస్తే పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు స్పష్టం చేసింది. తీసుకున్న అప్పులను సామాజిక హితం కోణంలోనే ఖర్చు చేస్తోంది. భారీగా సంక్షేమ పథకాలు, నగదు బదిలీతో పేదలకు లబ్ధి చేకూరుస్తోంది.

కోవిడ్‌ సమయంలోనూ డీబీటీతో పేదలను ఆదుకోవడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా చర్యలు తీసుకుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇవన్నీ ముమ్మాటికీ నిజమని రుజువైంది. ఈ గణాంకాలను ఆర్బీఐ నివేదిక ప్రకారం వెల్లడిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. ఇప్పటికైనా పాఠకులకు తప్పుడు సమాచారాన్ని చేరవేయకుండా విశ్వసనీయతతో జర్నలిజం విలువలను పాటించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.  

మరిన్ని వార్తలు