జైహింద్‌ స్పెషల్‌: ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించక ముందు మన పోలీసు చరిత్ర మరోలా ఉండేది!

15 Jun, 2022 13:14 IST|Sakshi

బ్రిటిష్‌ వారు 1861లో తెచ్చిన పోలీసు చట్టాన్ని ఆధారం చేసుకునే నేటికీ మనం పోలీసు వ్యవస్థను నడుపుతున్నాం. పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పోలీసుల పని తీరు మీద అప్పుడప్పుడు మార్గదర్శకాలు ఇవ్వడం మినహా పూర్తి స్థాయి సంస్కరణలను చేసే అవకాశం లేదు. నేషనల్‌ పోలీస్‌ కమిషన్‌ పోలీసు విధానాన్ని పరిశీలించి 1979–81 మధ్యలో ఎనిమిది నివేదికలైతే ఇచ్చింది. ఆ తర్వాత కూడా అనేక కమిషన్‌లు, కమిటీలు ఏర్పాటయ్యాయి.

గోరే కమిటీ (1971–73), రెబీరో కమిటీ (1993), పద్మనాభయ్య కమిటీ (2000), నేషనల్‌ సెక్యూరిటీ మీద మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక (2001), మలీమత్‌ కమిటీ (2001–2003) వాటిల్లో ప్రధానమైనవి. బ్రిటిష్‌ దాస్య శృంఖలాల నుంచి విమక్తి పొంది 75 ఏళ్లు అవుతున్నా దేశంలోని పోలీసు వ్యవస్థను సమూలంగా సంస్కరించుకోలేకపోయాం అన్నది నిజం. బ్రిటిష్‌ వారు మన దేశాన్ని పాలించక ముందు మన పోలీసు చరిత్ర మరో విధంగా ఉండేది.

చాణక్యుడి అర్థశాస్త్రంలో పోలీసు నిఘా విభాగాలను వర్ణించిన తీరును గమనించినప్పుడు.. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలకు ముందే మన దగ్గర వ్యవస్థీకృత పోలీసు విధానం ఉండేదని అర్థమౌతుంది. ఆంగ్లేయుల పాలనలో భారతీయ స్వాతంత్య్ర పోరాటాన్ని, తిరుగుబాట్లను అణచి వేసేందుకే పోలీసు వ్యవస్థను వాడుకున్నారని, పోలీసుల్లో కర్కశత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే పెంపొందించారని చెబుతారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సైతం పోలీసులపై ఆ ముద్ర ఇంకా మిగిలే ఉంది. దానిని పోగొట్టుకునే విధంగా రాగల 25 ఏళ్ల కాలంలో పోలీసు సంస్కరణలు తేవలసిన అవసరం అయితే ఉంది.
 

మరిన్ని వార్తలు