జైహింద్‌ స్పెషల్‌: ఫడ్కే.. ఇప్పుడు నీకేం కావాలి? నీతో యుద్ధం.. 

1 Aug, 2022 12:38 IST|Sakshi

స్వాతంత్య్ర సముపార్జనకు విప్లవమార్గమే శరణ్యమని నమ్మి అనేక మంది భరతమాత బిడ్డలు బలిదానం చేశారు. ఇలాంటి విప్లవ వీరులకు ఆద్యుడు వాసుదేవ బలవంత్‌ ఫడ్కే! స్థానిక ఆదివాసీలతో కలిసి గెరిల్లా పోరుతో వలస పాలకులకు ఫడ్కే ముచ్చెమటలు పట్టించాడు. తొలిసారి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయుధం పట్టిన ఈ మరాఠా వీరుడిని ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్మ్‌డ్‌  రెబెలియన్‌’గా చరిత్రకారులు భావిస్తారు.
చదవండి: బ్రేకింగ్‌ న్యూస్‌..డయ్యర్‌కు బులెట్‌ దిగింది!

గ్రామం మధ్యలో శపథం
మరాఠీ చిత్పవన్‌ బ్రాహ్మణ కుటుంబంలో వాసుదేవ్‌ బల్వంత్‌రావ్‌ ఫడ్కే 1845 నవంబర్‌  4న వాసుదేవ్‌ జన్మించారు. స్వస్థలం మహారాష్ట్రలోని షిర్దాన్‌  గ్రామం. వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో వ్యవసాయ కుటుంబాలన్నీ దుర్బర దారిద్య్రం అనుభవించేవి. బాల్యంలో కుటుంబ బాధలు అర్ధం కాని వయసులో ఫడ్కే కుస్తీ, గుర్రపుస్వారీ వంటివి ఉత్సాహంగా నేర్చుకున్నారు. ఉన్నత పాఠశాల చదువు మధ్యలో వదిలివేశారు. 16 సంవత్సరాల వయసులో ఆయన పెళ్లి జరిగింది. కొంతకాలం రైల్వే సర్వీసులో పని చేసి అనంతరం స్వీయ పదవీ విరమణ చేసారు.

తరువాత  పుణే నగరం చేరుకుని మిలటరీ అక్కౌంట్స్‌ డిపార్టుమెంటులో గుమస్తాగా 15 సంవత్సరాల పాటు పని చేశారు. గణేష్‌ జోషి, రనడే ఏకనాథ వంటి ఉద్యమకారుల పరిచయంతో ఫడ్కే ‘పుణె నేటివ్‌’ అన్న సంస్థను స్థాపించారు. ఆ సమయంలోనే తల్లికి ఆరోగ్యం బాగోలేదు అన్న విషయం తెలుసుకొని స్వగ్రామం చేరుకున్నారు. అయితే బ్రిటిషర్‌ల ప్రోద్బలంతో గ్రామస్తులు ఫడ్కే రాకముందే ఆయన తల్లి దహనసంస్కారాలు పూర్తి చేశారు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన ఫడ్కే, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తానని గ్రామం మధ్యలో శపధం చేశారు. 

రామోషీ పోరాటం
1876 –77లో మహారాష్ట్రలో అత్యంత భయంకరమైన కరువు తాండవించింది. వేలమంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణించారు. అయితే బ్రిటిష్‌ దొరలు ఈ మరణాలను పట్టించుకోకపోగా, పండిన కాస్త పంటనూ బలవంతంగా తీసుకునేవాళ్లు. దీంతో పలు రైతు కుటుంబాలు నిరాధారాలయ్యాయి. అనేకమంది దారిద్ర బాధతో మగ్గిపోయారు. ఇవన్నీ చూస్తూన్న ఫడ్కే తీవ్రంగా బాధపడ్డారు. స్వరాజ్య సాధనే పరిస్థితులు మెరుగు పరుచుకుందుకు మార్గమని భావించారు. ఇందుకోసం స్థానిక కోలీలు, భీల్‌లు, ధంగారులు తెగల వారిని కూడగట్టుకొని ఒక తిరుగుబాటు సేనను తయారుచేసి దానికి ‘రామోషి‘ (ఒక ఆదివాసీ తెగ) అని పేరు పెట్టారు. ఈ సేనతో బ్రిటిష్‌ పరిపాలన అంతం చేయడానికి సాయుధ పోరాటాన్ని సాగించారు. బ్రిటిష్‌ సైనికులపై హఠాత్తుగా జరిపిన గెరిల్లా దాడుల్లోని ఒకదానిలో ఏకంగా పుణె నగరంపైనే ఫడ్కే పట్టు సాధించడం పాలకులను కలవరపెట్టింది.

వలస పాలకుల వల
ఫడ్కే ఉద్యమ ప్రభావంతో బ్రిటిష్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో  ఫడ్కేను చంపిన లేక బంధించిన వారికి రూ. 5వేల బహుమతి ఇస్తామని బొంబాయి ప్రభుత్వ గవర్నర్‌ సర్‌ రిచర్డ్‌ టెంపుల్‌ ప్రకటించారు. దీనికి జవాబుగా బొంబాయి గవర్నర్‌ సర్‌ టెంపుల్‌ తలనే తనకు తెచ్చిన వారికి పదివేల బహుమతి ఇస్తానని ఫడ్కే ప్రకటన చేయడం ఆయన నిర్భీతిత్వాన్ని చాటుతుంది. రామోషీ దాడులు అధికం కావడంతో ఫడ్కేను పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. మరోవైపు బ్రిటిషర్లకు సహకారం అందిస్తున్న నిజాం ప్రభుత్వం కూడా ఫడ్కేను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది. బ్రిటిష్‌ మేజర్‌ హెన్రీ విలియం డేనియల్, హైదరాబాద్‌ నిజాం పోలీసు కమిషనర్‌ అబ్దుల్‌ హక్‌ విరామం లేకుండా ఆయన అచూకీ కోసం వెతికారు. ఈ సమయంలో ఫడ్కే నిజాం రాజ్యానికి చేరుకున్నాడు.

వీరుడి మాటలు
ఒక రోజు మొత్తం పరిగెడుతూనే ఉండడం వల్ల చాలా అలసిపోయి ఉన్న ఫడ్కేకు జ్వరం రావడంతో విశ్రాంతి కోసం హైదరాబాదులోని కలాడిగిన తాలూకాలోని ఒక పల్లెటూరికి చేరి దేవి మందిరంలో పడుకున్నారు. జ్వరంతో స్పృహ తప్పిన స్థితిలో ఉన్న ఆయనను కనిపెట్టి స్థానిక మహిళలు కొందరు ధనం కోసం ఆశపడి సైనికులకు చెప్పారు. ఈ సమాచరంతో బ్రిటిష్‌ ఆర్మీ మేజర్‌ డేనియల్‌ అక్కడికి చేరుకున్నాడు.

తన బలగాలను అక్కడ మోహరించి, ఫడ్కే గుండెలపై తంతూ, మెడ మీద కాలు పెట్టి.. ‘ఫడ్కే, ఇప్పుడు నీకు ఏం కావాలి అని అడిగాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ‘నీతో యుద్ధం చేద్దామనుకుంటున్నాను’ అని వీరుడిలాగా ఫడ్కే సమాధానమిచ్చారు. కానీ అందుకు జడిసిన డేనియల్‌.. ఫడ్కేను బంధించి పుణె తీసుకువెళ్లాడు. అనంతరం ఆయన్న యెమెన్‌లోని ఏడిన్‌ కారాగారానికి తరలించారు. 1883 ఫిబ్రవరి 13 న ఫడ్కే అక్కడ నుంచి తప్పించుకున్నా, వెంటనే తిరిగి పట్టుబడ్డారు. రెండోదఫా కారాగారవాసంలో ఫడ్కే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కారణంగా ఫిబ్రవరి 17న 1883 న ఫడ్కే  37 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు.

‘ఈ దేశ ప్రజలందరూ నాలాగా భరతమాత ముద్దుబిడ్డలే. వారంతా ఆకలి, దారిద్య్రంతో అలమటిస్తూంటే, ఏమీ పట్టనట్టుగా జీవించడమనే ఊహే నేను భరించలేను. నా ప్రజలకు స్వతంత్రం ఇవ్వడం కోసం, అవసరం అయితే నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అని ఫడ్కే తన డైరీలో రాసుకున్న మాటలు ఆయన అకుంఠిత దేశభక్తిని చాటుతున్నాయి. 
– దుర్గరాజు శాయి ప్రమోద్‌ 

మరిన్ని వార్తలు