మహోజ్వల భారతి: భారతజాతి మిత్రుడు బెంజిమన్‌

17 Jul, 2022 13:15 IST|Sakshi

వ్యక్తులు ::: ఘటనలు ::: సందర్భాలు ::: స్థలాలు :: సమయాలు  (ప్రీ–ఫ్రీడమ్, పోస్ట్‌ ఫ్రీడమ్‌)

జలియన్‌ వాలా బాగ్‌ హత్యాకాండ వార్త అది జరిగిన ఐదారు వారాలకు గాని..  పంజాబ్‌ నుంచి మిగిలిన భారతదేశానికి చేరలేదు. నాడు అంత దారుణంగా పత్రికల నోరు నొక్కింది బ్రిటిష్‌ ప్రభుత్వం. అలాంటి పరిస్థితులలో హార్నిమన్‌  ఆ ఘోరాన్ని ఇంగ్లండ్‌లోని లేబర్‌పార్టీ పెద్దలకు రహస్యంగా చేరవేసి సంచలనం సృష్టించారు. అందుకే ఆయనను నాటి మహోన్నత స్వాతంత్య్రోద్యమ రథసారథులు మనసారా ‘భారత జాతి మిత్రుడు’ అని పిలుచుకున్నారు. 

బెంగాల్‌ను విభజిస్తున్నట్టు 1905 అక్టోబర్‌ 16న వైస్రాయ్‌ లార్డ్‌ కర్జన్‌  ప్రకటించగానే  భారతీయులు భగ్గుమన్నారు. హిందువులు, ముస్లింలు ఒకరి చేతికి ఒకరు రాఖీలు కట్టుకుని, ఐక్యతను చాటారు. బిపిన్‌ చంద్రపాల్, అరవింద్‌ ఘోష్, చిత్తరంజన్‌  దాస్‌ వంటివారితో పాటు కొన్నివేల మంది గంగానదిలో స్నానం చేసి, ప్రభుత్వం వంగదేశ విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆనాటి ఆ చరిత్రాత్మక ఘట్టంలో ఒక్క వ్యక్తి  మాత్రం ప్రత్యేకంగా కనిపించారు.

చిన్న గావంచా కట్టుకుని గంగలో స్నానమాచరించి, ఆయన కూడా బ్రిటిష్‌ ప్రభుత్వం మీద పోరాడతానని ప్రతిన పూనారు. కానీ, ఆయన భారతీయుడు కాదు. తెల్ల జాతీయుడు! ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ‘ది స్టేట్స్‌మన్‌ ’ సహాయ సంపాదకుడు. పేరు బెంజిమన్‌  గై హార్నిమన్‌.  బాలగంగాధర తిలక్, సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఫిరోజ్‌షా మెహతా, మోతీలాల్, ఎంఏ జిన్నా, అనిబీసెంట్, సరోజినీ నాయుడు వంటి వారితో ఆయన భుజం భుజం కలిపి భారత స్వాతంత్య్రోద్యమంలో నడిచారు. 

నేడు బెంజిమన్‌ గై హార్నిమన్‌ జయంతి. 1873 జూలై 17న  జన్మించారు. బ్రిటన్‌లో పుట్టి, ఇండియాలో స్థిరపడిన జర్నలిస్ట్‌ ఆయన. జలియన్‌ వాలా దురంతం మీద హార్నిమన్‌  ఒక పుస్తకమే రాశారు. దాని పేరు ‘బ్రిటిష్‌ అడ్మినిస్ట్రేషన్‌  అండ్‌ ది అమృత్‌సర్‌ మేసకర్‌’. ఈ పుస్తకాన్ని 1984లో భారతదేశంలో పునర్‌ ముద్రించారు కూడా.

ఎలాంటి దేశం మీద, ఎలాంటి దుస్థితిలో జీవనం సాగిస్తున్న ప్రజల మీద తెల్ల జాతీయులు దాష్టీకం చేస్తున్నారో, జలియన్‌ వాలా బాగ్‌ కాల్పుల వంటి రాక్షసకృత్యానికి పాల్పడ్డారో ఆయన అందులో ఎంతో అద్భుతంగా వర్ణించారు. రాజనీతి గురించి ప్రపంచానికి నీతులు చెప్పే ఇంగ్లండ్‌ భారతదేశంలో పత్రికల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో కూడా బహిర్గతం చేశారు. 1947లో భారతదేశం బ్రిటిష్‌ ప్రభుత్వం అధీనం నుంచి విముక్తమైన గొప్ప దృశ్యాన్ని హార్నిమన్‌  వీక్షించారు. ఆ మరుసటి సంవత్సరం కన్నుమూశారు.  

మరిన్ని వార్తలు