చైతన్య భారతి: అణుశక్తిమాన్‌

22 Jun, 2022 08:09 IST|Sakshi

ఒకసారి ఒక పాత్రికేయుడు, హోమీ భాభాతో ఆయన వివాహం గురించి అడిగారు. అప్పుడు ఆయన, ‘‘నేను సృజనాత్మకతను పెళ్లాడాను’’ అని చెప్పారు. నిపుణులైన వ్యక్తుల చుట్టూ ఉత్కృష్టమైన సంస్థలను సృష్టించడం ఆయన శైలి. అందుకు తగ్గట్లే, ట్రాంబేలో ఏర్పాటు చేసిన అణుశక్తి సంస్థకు ఆయన పేరు కలిసి వచ్చేలా ‘బార్క్‌’ (భాభా అణు పరిశోధనా కేంద్రం) అని పేరు పెట్టారు. భారతదేశ అణుశక్తి కార్యక్రమానికి రూపశిల్పి అయిన హోమీ జహంగీర్‌ భాభా ఇంజనీరింగ్‌ డిగ్రీ చదవడం కోసం ఇంగ్లండ్‌ వెళ్లారు.

కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ఆయన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. నిజానికైతే విజ్ఞాన శాస్త్రంలో ప్రాథమిక పరిశోధన చేయడం అంటే ఆయనకు పంచప్రాణాలు. 1939 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ సి.వి.రామన్‌ దగ్గర పని చేశారు. ‘‘ప్రపంచంలో ముందంజలో నిలవదలిచిన ఏ దేశమూ మౌలిక లేదా దీర్ఘకాలిక పరిశోధనను నిర్లక్ష్యం చేయలేదు..’’అని భాభా ఒకసారి అన్నారు. భారతదేశాన్ని అణుశక్తి సంపన్న దేశంగా తీర్చిదిద్దడానికి తొలి చర్యగా ఆయన ‘టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టి.ఐ.ఎఫ్‌.ఆర్‌) ను స్థాపించారు. 1945లో ఆరంభమైన ఈ సంస్థ మౌలిక విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యానికి కృషి చేసింది.

ఇక, 1948లో భారతదేశ అణుశక్తి కార్యక్రమానికీ ఆయనే రూపకల్పన చేశారు. ఆయన కృషి ఫలితంగా భారతదేశం దాదాపు 50 ఏళ్ల క్రితమే ఓ పరిశోధక అణు రియాక్టర్‌ను డిజైన్‌ చేసింది. అణుశక్తి కార్యక్రమంతో పాటు తొలినాళ్లలో దేశ అంతరిక్ష కార్యక్రమానికి బీజం వేసి, పెంచి పోషించడంలో కూడా హోమీ భాభా కీలక పాత్ర వహించారు. అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి గట్టి మద్దతు, అమోదముద్ర లభించడంతో దేశాన్ని అణుశక్తియుత దేశంగా మార్చాలన్న భాభా కల నెరవేరింది.  

భాభా బహుముఖ పార్శా్వలున్న వ్యక్తి. సంక్లిష్ట గణితం గురించి ఆయన ఎంత ధారాళంగా మాట్లాడతారో, పాశ్చాత్య సంగీతంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాల గురించీ అంతే ధారాళంగా మాట్లాడతారు. ఆయన స్వతహాగా చిత్రకారుడు, భవన నిర్మాణ శిల్పి కూడా. ఇక ఆయన వేసిన వర్ణ చిత్రాలు టి.ఐ.ఎఫ్‌.ఆర్‌., బార్క్‌ ప్రాంగణాలలో ఎల్లప్పుడూ ప్రదర్శనకు ఉంటాయి. భారత అణుశక్తి కార్యక్రమం కీలకమైన దశలో ఉండగా, విధి ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించింది. 1966లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఈ భరతజాతి ముద్దు బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. 
– శ్రీకుమార్‌ బెనర్జీ, భాభా అణు పరిశోధనా కేంద్రంలో పూర్వపు డైరెక్టర్‌  

(చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు)

మరిన్ని వార్తలు