దేశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌!

25 Oct, 2023 15:08 IST|Sakshi

ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి NCERT  ప్యానెల్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ మండలికి సిఫార్సు చేయనుంది. 

జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్‌, మార్పులు చేర్పులు, 2020 పాలసీకి సవరణలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్‌ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్‌ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్‌ చైర్మన్‌ ఐజాక్‌ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్‌ ఉంటుందని స్పష్టం చేశారాయన.  

చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్‌సీఈఆర్‌టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్‌ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్‌ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. 

మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన. 

అయితే ఢిల్లీ ఎన్‌సీఈఆర్‌టీ ప్రధాన కార్యాలయానికి ఈ ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఈ దశలో ఈ పరిణామంపై స్పందించడం అవసరమని ఎన్‌సీఈఆర్‌టీ అంటోంది. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్‌సీఈఆర్‌టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు.

మరిన్ని వార్తలు