బిహార్‌లో నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తం.. పోలీసుల లాఠీఛార్జ్‌

22 Aug, 2022 17:53 IST|Sakshi

పాట్నా: బిహార్‌ రాజధాని పాట్నాలో నిరుద్యోగులు తలపెట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వారని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావాహులపై జల ఫిరంగాలు ప్రయోగించారు. జాతీయ జెండాను పట్టుకున్న ఓ యువకుడిని డిప్యూటీ కలెక్టర్‌ లాఠీతో కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  మరోవైపు.. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, జీఎస్‌టీ, అగ్నిపత్‌ పథకాలను నిరసిస్తూ జన్‌ అధికార్‌ పార్టీ లోక్‌తాంత్రిక్‌ ఆందోళనకు దిగినట్లు పలువురు పేర్కొన్నారు. 

ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసనలు చేపట్టినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నిరసనల సందర్బంగా పాట్నా డిప్యూటీ కలెక్టర్‌ ఓ యువకుడిని తీవ్రంగా కొట్టటం, రోడ్డుపై ఈడ్చుకెళ్లటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పాట్నా అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ కేకే సింగ్‌.. నిరసనకారులను కిందపడేసి కొట్టారు. జాతీయ జెండా పట్టుకున్న యువకుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

మరోవైపు.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ కొత్త ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించనుందని ప్రకటించారు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. ఈ క్రమంలో నిరుద్యోగులు నిరసనలు దిగటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌ అధికార కూటమిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇచ్చిన హామీని నెరవేర్చలేకే నిరుద్యోగులపై లాఠీఛార్జ్‌ చేశారని ఆరోపించారు బీజేపీ నేత షేహజాద్‌ పూనావాలా. తన హామీపై ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: బీహార్‌ సీఎం నితీష్‌కు బిగ్‌ షాక్‌.. దాడి చేసిన 13 మంది అరెస్ట్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు