Indira Gandhi: ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు?

7 Oct, 2023 13:36 IST|Sakshi

అది 1974వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీకి సమీపంలోని దాద్రీ, గౌతమ్ బుద్ధ నగర్‌లో ఇందిరా గాంధీ ప్రచార సభ జరగాల్సి ఉంది. గుర్జర్ నేత రామచంద్ర వికల్‌కు ఓటు వేయాలని ఇందిర అభ్యర్థించాల్సివుంది. 

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చౌదరి చరణ్ సింగ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందిరా గాంధీతోపాటు పార్టీ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఈ నేపధ్యంలో గుర్జర్ నేత వికల్ రూపంలో కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయాన్ని చూసుకుంది. ఆ సమయంలో రామచంద్ర వికల్‌ బాగ్‌పత్‌ ఎంపీగా ఉన్నారు. దాద్రీ ప్రాంతం.. తిరుగుబాటు రైతు నేత బీహారీ సింగ్‌కు బలమైన కంచుకోట. అతను ఈ ప్రాంత నివాసి. ఇందిరా గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచారు. అయినా వీటిని గుర్తించకుండా  ఇందిర.. గుర్జర్‌ నేత వికల్‌ను రంగంలోకి దించారు. టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించిన బీహారీ సింగ్ తిరుగుబాటు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బీహారీ సింగ్‌కు ఎన్నికల చిహ్నంగా ‘సింహం’ గుర్తు కేటాయించారు. ఈ నేపధ్యంలో బీహారీ సింగ్‌.. తనకు టిక్కెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదని, అయితే వికల్‌కు అనుకూలంగా బహిరంగ సభ పెట్టవద్దని ఇందిరాగాంధీకి సందేశం పంపినా,  ఆమె పట్టించుకోలేదు. బిహారీ సింగ్ బాగీ ఆ రోజు జరగాల్సిన ఇందిరాగాంధీ బహిరంగ సభను ఆపేందుకు ప్లాన్‌ వేశారు. ఆ సమయంలో దాద్రీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో ఓ సర్కస్ నడుస్తోంది. బిహారీ సింగ్ ఆ సర్కస్ నుండి 500 రూపాయలకు ఒక సింహాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిని బోనులో ఉంచారు. 

ఇందిరా గాంధీ సభ ప్రారంభం కాగానే బిహారీ సింగ్ సింహం ఉన్న బోనుతో సహా సమావేశానికి చేరుకుని, ఒక్కసారిగా బోను తెరిచారు. సింహం బయటకు రాగానే ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. జనం చెల్లాచెదురయ్యారు. ఫలితంగా ఇందిర తన సభను 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చింది. బీహారీ సింగ్ బాగీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర వికల్ కూడా ఓటమిపాలయ్యారు. బిహారీ సింగ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా సన్నిహితుడు. 1992లో బీహారీ సింగ్ ఒక రైతు ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు అతనిపై  కాల్పులు జరిపారు. ఈ దాడిలో బిహారీ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. 2020 నవంబరు 29న బిహారీ సింగ్ బాగీ మరణించారు. త్వరలో బిహారీ సింగ్ విగ్రహాన్ని అతని స్వగ్రామమైన రుబ్బాస్‌లో ఆవిష్కరించనున్నారు. 
ఇది కూడా చదవండి: పేదరికంలో పుట్టిన పుతిన్‌ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు?

మరిన్ని వార్తలు