ప్రమాదంలో జీవ వైవిధ్యం

7 Jun, 2023 04:12 IST|Sakshi

తక్షణం మేలుకోకుంటే పెను ముప్పే

క్షీణిస్తున్న జీవవైవిధ్య హాట్‌స్పాట్లు

కాపాడుకునే కార్యాచరణ తక్షణావసరం

లేదంటే పూడ్చుకోలేని నష్టమే: శాస్త్రవేత్తలు

ఆకాశాన్నంటే హిమాలయాల నుంచి, మూడు వైపులా ఆవరించిన అనంత సాగర జలరాశి దాకా; సహారా ఇసుక ఎడారి మొదలుకుని, అపార జీవరాశికి ఆలవాలమైన సుందర్బన్‌ వంటి అడవుల దాకా... అంతులేని జీవ వైవిధ్యానికి పుట్టిల్లు మన దేశం. అలాంటి జీవవైవిధ్యం ఇప్పుడు మనిషి నిర్వాకం వల్ల అక్షరాలా అతలాకుతలమవుతోంది.  అస్తిత్వం కోసం పెనుగులాడుతోంది.  అతి త్వరలో పూర్తిగా అంతరించిపోయే  పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

కారణమేమిటి?
విచ్చలవిడిగా అడవుల నరికివేత, అడ్డూ అదుపూ లేని పట్టణీకరణ, ఫలితంగా విపరీతమైన కాలుష్యం, వాతావరణ మార్పులు తదితరాలు.
భారత్‌లో 1990–2020 మధ్య 30 ఏళ్లలోనే ఏకంగా ఏడు లక్షల హెక్టార్ల మేరకు అడవి నరికివేతకు గురైనట్లు యుటిలిటీ బిడ్డర్‌ నివేదిక చెబుతోంది. ఇదిఇలాగే కొనసాగితే వన్యప్రాణులకు కనీసం నిలువ నీడ కరువవుతుంది.
విచ్చలవిడిగా విస్తరిస్తున్న నగరాలు క్రమంగా చిత్తడి, గడ్డి నేలల వంటి సహజ జీవ వ్యవస్థలను కబళిస్తున్నాయి.
ప్రణాళికలేని విస్తరణతో పలు నగరాలు వరదల వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి.
దీని తాలూకు విపరిణామాలకు బెంగళూరే అతి పెద్ద ఉదాహరణ. కేవలం గత 50 ఏళ్లలోనే నగరంలో పచ్చదనం 88 శాతం, నీటి వనరులు 79 శాతం మటుమాయమయ్యాయి!
పెరిగిపోతున్న ధ్వని, కాంతి కాలుష్యం వణ్యప్రాణుల జీవితాలను, ప్రవర్తనను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని... మొత్తంగా వాటి మనుగడనే దెబ్బ తీస్తోంది.

ముప్పేట ముప్పు!
 జీవవైవిధ్యం అంతరిస్తే తలెత్తే విపరిణామాలను ఊహించడం కూడా కష్టమే.
వాతావరణ ధోరణులు పూర్తిగా మారిపోతాయి. వాటితో పాటే రుతువులూ క్రమం తప్పిపోతాయి. అంతా అల్లకల్లోలమవుతుంది.
 సముద్ర మట్టాలు మరింత పెరిగి తీర ప్రాంతాలను క్రమంగా కనుమరుగవుతాయి.
సముద్ర జలాల్లో ఆమ్లత్వం పెరిగి వాటిలోని జీవజాలానికి ముప్పు ఏర్పడుతుంది.
హిమానీ నదాలు శరవేగంగా కరిగిపోతాయి.
ప్రజలు భారీగా నిర్వాసితులవుతారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
పలు అరుదైన జీవ జాతులు శాశ్వతంగా అంతరించిపోతాయి. రాయల్‌ బెంగాల్‌ టైగర్, గోల్డెన్‌ లంగూర్, సిరోయ్‌ లిలీ వంటివి ఇప్పటికే ఈ జాబితాలోకి చేరాయి.

ఏం చేయాలి?
జీవవైవిధ్యపరంగా ప్రస్తుత తిరోగమన ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వాలు తక్షణం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రంగంలోకి దిగాలి.
 శాస్త్రీయ, సమాజ, విధానపరంగా కలసికట్టుగా కృషి జరగాలి.
 పర్యావరణ, సహజ వనరుల పరిరక్షణకు నగదు ప్రోత్సాహకాల వంటివి ఇవ్వాలి. ఉత్తరాఖండ్‌ ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
 తీవ్ర వాతావరణ పరిస్థితులను నిరోధించి పర్యావరణ సమతుల్యతను కాపాడే మడఅడవుల వంటి సహజ వనరులను పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవాలి.
 పర్యావరణ విద్యను బోధన ప్రణాళికలో తప్పనిసరి చేయాలి.
 జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యత ప్రజలందరికీ అర్థమయ్యేలా ముమ్మర ప్రచారం చేపట్టాలి.    

హాట్‌స్పాట్స్‌.. విశేషాల పుట్టిళ్లు!
 అంతర్జాతీయ గుర్తింపున్న 36 జీవవైవిధ్య హాట్‌స్పాట్లలో నాలుగింటికి భారత్‌  నెలవు. అవి హిమాలయ ప్రాంతం,  పశ్చిమ కనుమలు, ఇండో–బర్మా జోన్, సుందర్బన్‌ అడవులు.
ఇవి మనుషులతో పాటు పలు జీవజాలాలకు నిలయాలు.
 తాగునీటి, ఆహార అవసరాలను సమర్థంగా తీరుస్తున్నాయి.
 వాతావరణాన్ని నియంత్రిస్తూ జీవజాలానికి ఎంతో మేలు చేస్తున్నాయి.
 ప్రాణికోటి మనుగడకు అత్యవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తికి ఇవి ప్రధాన వనరులు.
ఈ హాట్‌స్పాట్లు అతి పెద్ద పర్యాటక ఆకర్షణలు. తద్వారా స్థానికులకు ఆర్థికంగా పెద్ద ఆలంబనగా నిలుస్తున్నాయి.
 ఇక ఈ హాట్‌ స్పాట్స్‌కు మూలమైన అడవుల మీద దేశ జనాభాలో 22 శాతం మంది తమ జీవికకు, సామాజిక, సాంస్కృతిక అవసరాలకు పూర్తిగా ఆధారపడ్డారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు