అమిత్‌ షా ‘విలన్‌’ రోల్‌ అయితే.. థాక్రే ‘హీరో’ రోల్‌! : బీజేపీ సాలిడ్‌ కౌంటర్‌

20 Feb, 2023 18:37 IST|Sakshi

ముంబై:  ఎన్నికల సంఘం నిర్ణయంతో శివసేన పార్టీ పేరు, గుర్తు చేజారిపోయిన క్రమంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే తీవ్ర విమర్శలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఉద్దేశించి.. తీవ్ర విమర్శలు చేశారాయన. అలాగే.. మొగాంబో ఖుష్ హువా, అమిత్‌ షాపై థాక్రే చేసిన కామెంట్‌ రాజకీయ దుమారం రేపింది. 

మొగాంబో అనేది ఎయిటీస్‌లో(1987) వచ్చిన మిస్టర్‌ ఇండియా చిత్రంలోని విలన్‌ క్యారెక్టర్‌. శేఖర్‌కపూర్‌ డైరెక్షన్‌లో అనిల్‌కపూర్‌-శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ సూపర్‌ హీరో చిత్రం.. క్లాసిక్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విలన్‌ మొగాంబో పాత్రను అమ్రిష్‌ పురి అత్యద్భుతంగా పండించారు. ఆ విలన్‌ను క్యారెక్టర్‌ను.. అమిత్‌ షాకు ఆపాదించడంతో  బీజేపీ కౌంటర్‌ ఎటాక్‌కు దిగింది. 

అమిత్‌ షా మొగాంబో అయితే.. ఉద్దవ్‌ థాక్రే మాత్రం మిస్టర్‌ ఇండియా హీరో రోల్‌ అంటూ సెటైర్లు వేశారు ముంబై బీజేపీ ఎమ్మెల్యే అతుల్‌ భట్‌ఖాల్కర్‌. ఉద్దవ్‌ థాక్రే బీజేపీ అధినాయకత్వాన్ని మొగాంబోతో పోలుస్తున్నారు. ఇలాంటి మూర్ఖపు కామెంట్ల నడుమ ఆయనకు అర్థంకాని విషయం ఒకటి ఉంది. ఆయన తనకు తెలియకుండానే మిస్టర్‌ ఇండియా(వాచీ పెట్టకుని మాయమైపోయే హీరో క్యారెక్టర్‌) లాగా మాయమైపోతున్నాడు.

మహారాష్ట్ర రాజకీయాల నుంచి ఉద్దవ్‌ థాక్రే దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితికి చేరుకున్నారు. ఇక మీరు ఇంట్లోనే ఉండాల్సిన టైమొచ్చింది అని ఉద్దవ్‌ థాక్రేను ఉద్దేశించి అతుల్‌ సెటైర్లు సంధించారు. 

మరిన్ని వార్తలు