ఢిల్లీ వీధుల్లో బీజేపీ వినూత్న ప్రదర్శన..  

11 Jun, 2023 13:54 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు రామ్ లీలా మైదానం వరకు భారీ ర్యాలీగా కదిలి అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం ర్యాలీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రిలాక్స్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులకు ఆదివారం ఉదయాన్నే సూపర్ స్ట్రోక్ ఇచ్చింది బీజేపీ పార్టీ. వారు ఢిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే దారి పొడవునా బ్యానర్లు, ప్లకార్డులు తగిలించేశారు. 

బీజేపీ సూపర్ స్ట్రోక్.. 
అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభకు సంబంధించిన ప్రచార బ్యానర్ల కంటే కూడా బీజేపీ తగిలించిన ఈ పోస్టర్లే జనాలను బాగా ఆకర్షిస్తుండటం విశేషం. ఆమ్ ఆద్మీ పార్ట్ బ్యానర్లలో కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ అని ఉంటే ..  బీజేపీ రాసిన బ్యానర్లలో ఢిల్లీ సీఎం నిర్మించుకున్న సొంత ఇంటి భవనం గురించి మాత్రమే ప్రస్తావించారు.. 

"ఇంటి పునర్నిర్మాణానికి రూ. 45 కోట్లా.. ప్రజల వద్ద టాక్స్ రూపంలో వసూలు చేసిందేగా..?"
"మాక్కూడా రూ. 45 కోట్ల భవనాన్ని చూడాలని ఉంది.."  అని రాసిన బ్యానర్లు ఢిల్లీ వీధుల్లో ఎక్కడ పెడితే అక్కడ దర్శనమిచ్చాయి. 

కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఉండడానికి ఢిల్లీ సీఎం దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నియంతృత్వ పాలనను తలపిస్తున్నాయని ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ, బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. 

కానీ ర్యాలీ రోజు ఉదయాన్నే బీజేపీ కౌంటర్ పోస్టర్లతో ఎన్ కౌంటర్ చేస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. అంతేకాదు బీజేపీ ఢిల్లీ తన ట్విట్టర్ అకౌంట్లో "ఢిల్లీని నాశనం చేయడానికి ఒక్కడు చాలు.. అతని పేరు అరవింద్ కేజ్రీవాల్" అని రాసి సీఎం ఫోటో ఉన్న ఒక సినిమా పోస్టర్ కూడా పోస్ట్ చేసింది.   

ఇది కూడా చదవండి: జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్   
  

మరిన్ని వార్తలు