గుడ్‌న్యూస్‌: పురుష ఉద్యోగులకు 730 పెయిడ్‌ లీవులు

19 Mar, 2021 12:13 IST|Sakshi
బీఎంసీ (ఫైల్‌ ఫోటో)

వికలాంగులను చూసుకునేందుకు సెలవులు 

పురుష ఉద్యోగులకు 730 పెయిడ్‌ లీవులకు బీఎంసీ నిర్ణయం 

మహాసభలో ప్రతిపాదన.. బీఎంసీ సభ్యుల ఆమోదం 

సాక్షి, ముంబై: అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకునేందుకు బెస్ట్‌ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు పేయిడ్‌ లీవులు ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు, వారికి 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది. దీంతో ఇంటివద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్‌ కిశోరీ పేడ్నేకర్‌ తెలిపారు. వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొందరి ఇళ్లలో తల్లులుగాని, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరుండరు. దీంతో గత్యంతరం లేక తండ్రులే వారి బాగోగులు చూసుకోవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

సెలవుపెట్టి ఇంటివద్ద ఉండటం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు పదవీ విరమణ పొందేవరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చేవరకు 730 సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించినట్లు బెస్ట్‌ సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌ షిండే తెలిపారు. ఈ సెలవులు పొందాలంటే దరఖాస్తుతోపాటు 40 శాతం వికలాంగుడిగా ఉన్నట్లు సర్టిఫికెట్‌ జోడించాల్సి ఉంటుంది.  వికలాంగ పిల్లలు తనపై ఆధారపడి ఉన్నట్లు సర్టిఫికెట్‌ జతచేయాల్సి ఉంటుంది.   

చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.

మరిన్ని వార్తలు