ఎంపీ మహువా కేసులో సీబీఐ విచారణ !

25 Nov, 2023 19:06 IST|Sakshi

ఢిల్లీ: తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా డబ్బుకు ప్రశ్నల స్కామ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. లోక్‌పాల్‌ మార్గదర్శకాల మేరకు ఈ స్కామ్‌లో  సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. మొయిత్రాపై కేసు నమోదు చేయాలా లేదా అనే అంశాన్నితేల్చడానికి ప్రాథమిక విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో సుప్రీం కోర్టు అడ్వకేట్‌ జై అనంత్‌ దేహదారి ఫిర్యాదు మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించిందని సమాచారం. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికిగాను ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని వద్ద నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులో దేహదారి ఆరోపించారు. దేహదారి ఇదే విషయమై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేకు లేఖ రాశారు. దీంతో ఆయన స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదుచేశారు. ఓం బిర్లా ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్‌ చేసిన విషయం తెలిసిందే. దూబే ఇంతటితో ఆగకుండా మహువాపై లోక్‌పాల్‌కు కూడా మరో ఫిర్యాదు చేశారు. 

అయితే సీబీఐ ప్రాథమిక విచారణలో నిందితులను అరెస్టు చేసే వీలుండదు. కానీ నిందితులను ప్రశ్నించే వెసులుబాటుతో పాటు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించే వీలుంటుంది. సీబీఐ మహువా కేసులో ప్రారంభించిన ప్రాథమిక విచారణ నివేదికను లోక్‌పాల్‌కు అందజేయాల్సి ఉంటుంది. 

డబ్బుకు ప్రశ్నల కేసులో ఇప్పటికే పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ ముందు విచారణకు హాజరైన మహువాను పార్లమెంటు నుంచి సస్పెండ్‌ చేయాలని కమిటీ స్పీకర్‌కు నివేదించింది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం స్పీకర్‌ తీసుకోవాల్సి ఉంది. 

తనకు తొలుత ఎంపీ మహువా తన ఈ మెయిల్‌ ఐడీ పంపించారని, తద్వారా ఆమెకు ప్రశ్నలు పంపితే వాటిని ఆమె పార్లమెంట్‌లో లేవనెత్తారని వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందాని పార్లమెంటుకు ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపారు. ఇంతేగాక మహువా ఏకంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను పంపించారని వాటితో తాను నేరుగా ప్రశ్నలు పోస్ట్ చేయగలిగానని వెల్లడించారు. 

ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు