Who Is Jharkhand New CM: జార్ఖండ్‌ సీఎంగా చంపయ్‌ సోరెన్‌!.. కల్పనా సోరెన్‌కు షాక్‌?

1 Feb, 2024 07:13 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌ కొత్త సీఎంగా చంపయ్‌ సోరెన్‌ పేరు ఖరారైంది. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయ్‌ సోరెన్‌ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఆ తరువాత గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.

కాగా, చంపయ్‌ సోరెన్‌ 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో  జన్మించారు. మెట్రిక్యులేషన్‌ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్‌ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్‌ కుటుంబంతో చంపయ్‌ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్‌ టైగర్‌ అని పిలుస్తుంటారు.  

సోరెన్‌ కుటుంబంలో పొలిటికల్‌ ట్విస్ట్‌..
ముఖ్యమంత్రి పదవిపై సోరెన్‌ కుటుంబంలో ఇంటిపోరు బయటపడింది. హేమంత్‌ సతీమణి కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ పెద్ద కోడలు సీతా సోరెన్‌ బహిరంగ ప్రకటన చేశారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే ఎందుకు? పార్టీలో ఎంతో మంది సీనియర్‌ నేతలుండగా.. ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు.. కుటుంబం నుంచే సీఎంను ఎన్నుకోవాలంటే ఇంట్లో నేనే సీనియర్‌. 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. ఆమెను ముఖ్యమంత్రి చేయాలనే ఏ చర్యపైనైనా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తాను’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు