మనీ లాండరింగ్‌ కేసు: సీఎం సోరెన్‌ అరెస్ట్‌

1 Feb, 2024 02:23 IST|Sakshi

మనీ లాండరింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ 

అరెస్టు కంటే ముందే ముఖ్యమంత్రి పదవికి హేమంత్‌ రాజీనామా 

జార్ఖండ్‌ కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్‌ నేత చంపయ్‌ సోరెన్‌

రాంచీ: జార్ఖండ్‌ రాజకీయాలు అనూహ్యమైన మలుపు తిరిగాయి. పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ను బుధవారం రాత్రి 9.30 గంటలకు అరెస్టు చేశారు. గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో సోరెన్‌ను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

అరెస్టు కంటే ముందే హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్‌ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయ్‌ సోరెన్‌ పేరును అధికార జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)–కాంగ్రెస్‌–రా్రïÙ్టయ జనతాదళ్‌(ఆర్జేడీ) నేతలు ప్రతిపాదించారు. మనీ లాండరింగ్‌ కేసులో తొలుత హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు పటిష్టమైన భద్రత మధ్య సుదీర్ఘంగా విచారించారు.

అనంతరం ఆయన తమ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాలు అందజేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్‌ సోరెన్‌ను నిమిషాల వ్యవధిలోనే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సమావేశమయ్యారు. తమ పార్టీ శాసనసభాపక్ష నాయకుడి ఎన్నికపై చర్చించారు.

కొత్త సీఎంగా చంపయ్‌ సోరెన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జేఎంఎం అధికార ప్రతినిధి వినోద్‌ పాండే చెప్పారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంపయ్‌ సోరెన్‌ అన్నారు. అంతకుముందు హేమంత్‌ సోరెన్‌ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్‌ లేదా వదిన సీతా సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. హేమంత్‌ సోరెన్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారని జేఎంఎం మహిళా ఎంపీ మహువా మాఝీ చెప్పారు.  

7 గంటలపాటు సోరెన్‌ విచారణ  
మనీ లాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించారు. రాంచీలోని సోరెన్‌ అధికార నివాసంలో 7 గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. సోరెన్‌కు సంఘీభావం తెలియజేస్తూ ఆయన నివాసానికి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఈడీ విచారణకు సోరెన్‌ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా చెప్పారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జేఎంఎం నేతలు, కార్యకర్తలు రాంచీకి చేరుకున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోరెన్‌ను లక్ష్యంగా చేసుకొని, విచారణ పేరుతో వేధిస్తోందని వారు మండిపడ్డారు. దళితుడు కావడం వల్లే సోరెన్‌పై వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. తమ ముఖ్యమంత్రి జైలుకు వెళితే తాము ఆయనతోపాటు వెళ్తామని తేలి్చచెప్పారు. ఇదే కేసులో ఈడీ అధికారులు ఈ నెల 20న హేమంత్‌ సోరెన్‌ను 7 గంటలపాటు విచారించారు. సోమవారం ఢిల్లీలో సోరెన్‌ నివాసంలో సోదాలు జరిపారు. చట్టవిరుద్ధంగా భూయాజమాన్య మారి్పడికి పాల్పడిన వ్యవహారంలో హేమంత్‌ సోరెన్‌ పాత్ర ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.  

ఈడీ అధికారులపై సోరెన్‌ ఫిర్యాదు
ఈడీ అధికారులపై హేమంత్‌ సోరెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోరెన్‌ ఫిర్యాదు మేరకు రాంచీలోని ఎస్సీ/ఎస్టీ పోలీసు స్టేషన్‌లో కొందరు సీనియర్‌ ఈడీ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిందని, తనను వేధింపులకు గురి చేస్తోందని, తన సామాజిక వర్గాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని ఫిర్యాదులో సోరెన్‌ ఆరోపించారు. ఈడీ అధికారుల తీరు వల్ల తన కుటుంబం మానసిక వేదన అనుభవిస్తోందని మండిపడ్డారు. ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలో హేమంత్‌ సోరెన్‌ ఇంట్లో సోదాలు చేశారు. రూ.36 లక్షల నగదు, కీలక పత్రాలతోపాటు ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ నగదు, ఆ కారుతో తనకు సంబంధం లేదని హేమంత్‌  తేలి్చచెప్పారు.    

ఎవరీ చంపయ్‌ సోరెన్‌?  
జార్ఖండ్‌ కొత్త సీఎంగా చంపయ్‌ సోరెన్‌ పేరు ఖరారైంది. ఆయన 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో        జని్మంచారు. మెట్రిక్యులేషన్‌ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్‌ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్‌ కుటుంబంతో చంపయ్‌ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్‌ టైగర్‌ అని పిలుస్తుంటారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు