సంస్థాగతంగా బలహీనంగా మారుతున్నాం: చిదంబరం

18 Nov, 2020 21:22 IST|Sakshi

కీలక సమయాల్లో చేతులెత్తుస్తున్నాం

చిన్న పార్టీలు బలంగా ఉన్నాయి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో బిహార్‌ ఎన్నికల రగడ ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించగా, తాజాగా మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి పి. చిదంబరం అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అన్ని ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత రోజు రోజుకి కాంగ్రెస్‌ పార్టీ బలహీనమవుతోందని, సంస్థాగతంగా అది నిరూపితమవుతోందని అన్నారు. పార్టీ అనేక పరాజయాల్లో తాను నాయకత్వాన్ని బలపరిచానని, విధేయతతో మెలిగానని అన్నారు. బిహార్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అన్నిటి కన్నా మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం కింది స్థాయిలో కాంగ్రెస్‌ బలంగా లేదని తెలియజేస్తుందని అన్నారు. దీనికి కారణం క్షేత్ర స్థాయిలో కార్యాచరణ లోపించడం కానీ లేదా పార్టీ బలహీనపడిపోవడం కానీ కావచ్చని చెప్పారు.

బీహార్ లో ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీల కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ... చివరకు ఫలితం తారుమారైందని అన్నారు. ఈ ఓటమిపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరుస ఎదురు దెబ్బలతో కాంగ్రెస్‌ డీలా పడుతుందని సమీక్ష అవసరమని అన్నారు.సీపీఐ(ఎంఎల్‌)ఎంఐఎం వంటి చిన్న చిన్న పార్టీలు మంచి ఫలితాలు సాధించాయని,కారణం అవి సంస్థాగతంగా బలంగా ఉండటంతో సాధ్యమయిందన్నారు.ఇక కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో  జరగవలసి ఉన్న ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ ‘ఈ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం’ అన్నారు. మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గాంధీయేతరులు పార్టీని నడిపించాలని పిలుపునిచ్చారు కదా అనే ప్రశ్నకు చిదంబరం జాగ్రత్తగా సమాధానం ఇచ్చారు. "ఎఐసిసి (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సమావేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారో నేను చెప్పలేను. ఎన్నికలలో ఎవరైనా పోటీ చేయవచ్చు" అని ఆయన అన్నారు.

బిహార్‌లో పార్టీ ఓటమి తరువాత చాలా మంది తమ గళాన్ని విప్పుతున్నారు.పార్టీ పనితీరును సమీక్షించాలని, ఆత్మపరీశీలన చేసుకోవాలని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.కపిల్‌ సిబల్‌ అయితే బహిరంగంగా పార్టీ క్షీణించిందని,రాజకీయలను అర్థం చేసుకునే అనుభవజ్ఞులైన వారి చేతిలో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్‌ కూటమి  బిహార్‌లో  విజయానికి కొద్ది దూరంలో  ఆగిందని, అయిన నిందలన్నీ మాపైనే పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. 70 సీట్లలో పోటీ చేసినప్పటికీ 19 మాత్రమే గెలుచుకుందన్నారు.యూపీ,ఎంపీలో కీలకమైన సమయంలో చేతులెత్తేసిందని అన్నారు.

మరిన్ని వార్తలు