Congress Chintan Shivir: సోషల్‌ ఇంజనీరింగ్‌

15 May, 2022 04:57 IST|Sakshi
ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో భాగంగా జరిగిన పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ, ఏఐసీసీ నేతల కీలక సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్, కేసీ వేణుగోపాల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు పార్టీ పదవుల్లో సగం 

కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లో ఏకాభిప్రాయం

ఒక నేతకు రెండుసార్లే రాజ్యసభ టికెట్‌

ఎలక్షన్‌ కమిటీ స్థానంలో పార్లమెంటరీ బోర్డు?

అసమ్మతుల కీలక డిమాండ్‌కు ఆమోదముద్ర!

ఉదయ్‌పూర్‌ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అంతర్గత ప్రక్షాళన దిశగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కాంగ్రెస్‌ లోతుగా మల్లగుల్లాలు పడుతోంది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్‌ శిబిర్‌లో శనివారం రెండో రోజు పార్టీ మథనం సుదీర్ఘంగా కొనసాగింది. అంశాలవారీగా అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు రోజంతా చర్చలు జరిపాయి. సమాజంలో అన్ని వర్గాలకూ మళ్లీ చేరువ కావాలంటే పార్టీలో సోషల్‌ ఇంజనీరింగ్‌కు తెర తీయడమే మార్గమని సామాజిక, న్యాయ కమిటీ అభిప్రాయపడింది.

ఇందుకోసం పార్టీ విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం కేటాయించాలని దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఒక నేతను రాజ్యసభకు గరిష్టంగా రెండుసార్లు మాత్రమే నామినేట్‌ చేయాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా అసమ్మతి గళం విన్పిస్తున్న సీనియర్‌ నేతల ప్రధాన డిమాండ్‌ అయిన కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీని రద్దుకు, దాని స్థానంలో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకు కూడా అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతుండటం మరో కీలక పరిణామం.

సామాజిక న్యాయంపై మథనం
కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ సలహా మండలి ఏర్పాటు చేయాలని సామాజిక న్యాయ కమిటీ అధిష్టానానికి సిఫార్సు చేసింది.  పార్టీలో బూత్‌ స్థాయి నుంచి డీసీసీ, పీసీసీ, ఏఐసీసీ, సీడబ్ల్యూసీ దాకా అన్ని విభాగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రస్తుతమున్న 20 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్‌కు పట్టుబట్టడంతో పాటు ఆ కేటగిరీకి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నైష్పత్తికంగా రిజర్వేషన్లను వర్తింపజేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని సూచించింది.

కులాలవారీ జనగణన జరపాలని కూడా కోరాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పునరుద్ధరించడంతో పాటు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలని సూచించింది. కమిటీ చర్చల వివరాలు, సిఫార్సులను కన్వీనర్‌ సల్మాన్‌ ఖుర్షీద్, సభ్యుడు కొప్పుల రాజు శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు.

సామాజిక న్యాయ వ్యవహారాలపై రూపొందించాల్సిన విధానాలను సూచించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల నమ్మకాన్ని చూరగొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీ చీఫ్‌కు మండలి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఇప్పటిదాకా సరైన ప్రాతినిధ్యం దక్కని పలు ఉప కులాలను గుర్తించే ప్రక్రయను పార్టీపరంగా చేపట్టనున్నట్టు రాజు చెప్పారు. చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేయనున్నామన్నారు.

జీఎస్టీ పరిహారం మరో మూడేళ్లు
కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీఎస్టీ పరిహారాన్ని మరో మూడేళ్లు పొడిగించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు సమయం ఆసన్నమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రస్‌ ఆర్థిక రంగ ప్యానల్‌ కన్వీనర్‌ చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. ‘‘మోదీ సర్కారు పాలనలో ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటు కింది చూపే చేస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింతగా పెరిగాయి.

పెట్రో ధరల పెరుగుదల తదితరాలు సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయి. జీఎస్టీ చట్టాలను మోదీ స్కరారు పేలవంగా రూపొందించి, అన్యాయంగా అమలు చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రాల ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేనంత బలహీనంగా మారింది. తక్షణ పరిష్కార చర్యలు అవసరం’’ అని డిమాండ్‌ చేశారు. అన్ని అంశాల పైనా ఆర్థిక ప్యానల్‌ చర్చించినట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలూ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి.వాటిని ఎదుర్కొనే మార్గాలపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేక సమస్య మరింత తీవ్రతరమవుతోంది. కేవలం గత 7 నెలల్లో 22 బిలియన్‌ డాలర్లు దేశం నుండి బయటికి వెళ్లిపోయాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు 36 బిలియన్‌ డాలర్ల మేర క్షీణించాయి. రూపాయి విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. వీటిపై అంశాలవారీగా కేంద్రాన్ని కాంగ్రెస్‌ నిలదీస్తుందన్నారు. ఆటోమేషన్, రోబోటిక్స్, మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పరిశ్రమ, వ్యాపారం, వాణిజ్య రంగాలకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, శ్రామిక శక్తిని సిద్ధం చేయాలని కాంగ్రెస్‌ విశ్వసిస్తోందని చెప్పారు.

కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రియాంక?
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపనున్నట్టు సమాచారం. మరోవైపు, రాహుల్‌ ఇష్టపడని పక్షంలో ప్రియాంకను కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమించాలని చింతన్‌ శిబిర్‌ వద్ద పలువురు నేతలు కోరారు. శనివారమంతా నేతలు దీనిపై జోరుగా చర్చించుకున్నారు.

త్వరలో జన్‌ అభియాన్‌2
ఏఐసీసీ నేతలతో సోనియా చర్చలు
కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు జన్‌ జాగరణ్‌ అభియాన్‌ రెండో దశ నిర్వహణపై కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. చింతన్‌ శిబిర్‌లో భాగంగా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీలతో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జన్‌ జాగరణ్‌ అభియాన్‌తో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలు కోరారు. ఈ భేటీలో వచ్చిన ప్రతిపాదనలపై ఆదివారం చింతన్‌ శిబిర్‌ మూడో రోజు సీడబ్ల్యూసీ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. జన్‌ జాగరణ్‌ అభియాన్‌ తొలి దశను 2021 నవంబర్‌ 14–29 మధ్య దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ చేపట్టడం తెలిసిందే.

మరిన్ని వార్తలు