4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఏమైందన్న సుప్రీం.. కేంద్రానికి డెడ్‌లైన్‌

12 Jun, 2021 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: కొవిడ్‌-19తో మరణించిన బాధితులకు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనల  వ్యహారంలో ఏం తేల్చారని శుక్రవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆరా తీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, సహేతుకమైన ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై బదులు ఇవ్వడానికి మరికొంత టైం కావాలని కోర్టును కోరాడు. 

బిహార్‌ ప్రభుత్వం కరోనా వైరస్‌తో చనిపోయిన బాధితులకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ విషయం మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని బెంచ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ అభ్యర్థనల విషయంలో ఏం తేల్చారని, కరోనా మరణాల ఎక్స్‌గ్రేషియా స్పష్టమైన రూల్స్‌ తెలపాలని బెంచ్‌ కోరింది.  అంతేకాదు మరో పిటిషన్‌లో కొవిడ్‌ డెత్‌ సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో అవకతవకలు, జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై ఏం స్పందిస్తారని కోర్టు ఆరా తీసింది. దీనిపై మెహతా స్పందిస్తూ.. ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చా యని, వీటిని పరిష్కరించడంపైనే కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నాడు. 

అయితే సొలిసిటర్‌ జనరల్‌ రెండువారాల గడువు కోరగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. మే 24నే పిటిషన్లు దాఖలు కావడంతో.. ఇంకెంత గడువు ఇవ్వాలని బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌ 18న కేంద్రం తన వివరణను అందించాలని డెడ్‌లైన్‌ విధిస్తూ, జూన్‌21న తదుపరి విచారణ ఉంటుందని మెహతాకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 12(ii) ప్రకారం.. కరోనాతో చనిపోయిన వాళ్లకు నాలుగు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు బాధిత కటుంబాల బాధ్యతల్ని ప్రభుత్వాలే భరించాలని ఓ పిటిషన్‌దారుడు పేర్కొన్నాడు. ఇక మరో పిటిషన్‌లో కొవిడ్‌ మరణాల సర్టిఫికెట్ల జాప్యంపై పేర్కొనగా, ఐసీఎంఆర్‌ గైడ్‌లెన్స్‌ ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.

చదవండి: వాక్సినేషన్‌.. దేవుడ్ని  ప్రార్థించండి

మరిన్ని వార్తలు