కోవిడ్‌ కేసుల ఎఫెక్ట్‌.. అక్కడ రెస్టారెంట్స్‌, ఆఫీసుల్లో మాస్క్‌ తప్పనిసరి

9 Apr, 2023 09:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ భయపెడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6వేలు దాటిపోయింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 31వేల దాటింది. దీంతో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను సమీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా, కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి  సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ చేపట్టనుందని స్పష్టం చేసింది. ఐసియూలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని పేర్కొంది. మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరిగా చేశాయి. 

హర్యానా
కోవిడ్‌ కేసుల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా అమలు చేసేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు.

కేరళ
కేరళలో గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక  వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. కాబట్టి, వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. 

పుదుచ్చేరి
పుదుచ్చేరి ప్రభత్వుం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు