తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం!

3 Dec, 2022 18:54 IST|Sakshi

చెన్నై: దేశ రాజధానిలోని ఢిల్లీ ఎయిమ్స్‌పై సైబర్‌ దాడితో గత 10 రోజులుగా సర్వర్లు పనిచేయడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌ విషయం తేలకముందే మరో ఆసుపత్రిపై పంజా విసిరారు హ్యాకర్లు. సుమారు 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌ అమ్మకానికి పెట్టారు. తమిళనాడులోని శ్రీ శరణ్‌ మెడికల్‌ సెంటర్‌ సర్వర్లను హ్యాక్‌ చేసి రోగుల డేటాను పాపులర్‌ సైబర్‌ క్రైమ్‌ ఫోరమ్స్‌, టెలిగ్రామ్‌ ఛానళ్లలో అమ్మకానికి పెట్టినట్లు సైబర్‌ ముప్పుపై విశ్లేషించే సంస్థ ‘క్లౌడ్‌సెక్‌’ వెల్లడించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. 

క్లౌడ్‌సెక్‌ వివరాల ప్రకారం.. ‘థ్రీక్యూబ్‌ ఐటీ ల్యాబ్‌’ అనే థర్డ్‌ పార్టీ వెండర్‌ ద్వారా 2007 నుంచి 2011 మధ్య నమోదైన రోగుల వివరాలను దొంగిలించినట్లు తేలింది. అయితే, శ్రీ శరణ్‌ మెడికల్‌ సెంటర్‌కు థ్రీక్యూబ్‌ ఐటీ ల్యాబ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆపరేటింగ్‌ విధులు నిర్వర్తించటంపై సమాచారం లేదని పేర్కొంది. కొనుగోలుదారులు నమ్మేందుకు నమూనా జాబితాను ఆన్‌లైన్ ఉంచారు. లీక్‌ అయిన డేటాలో రోగుల పేర్లు, జన్మదినం, అడ్రస్‌, సంరక్షకుల పేర్లు, డాక్టర్ల వివరాలు ఉన్నాయి. డాక్టర్ల వివరాలతో ఏ ఆసుపత్రి డేటా హ్యాకింక్‌గు గురైందనే విషయాన్ని క్లౌడ్‌సెక్‌ గుర్తించింది. ఆన్‌లైన్‌ అమ్మకానికి ఉంచిన డేటాలోని డాక్లర్లు తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్‌ సెంటర్‌లో పని చేశారని తెలిపింది. 

ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు సమాచారం. ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ దాడి జరిగిన మరుసటి రోజునే తమిళనాడు శ్రీ శరణ్‌ ఆసుపత్రి డేటా లీక్‌ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇదీ చదవండి: 8 రోజులుగా ఎయిమ్స్‌ సర్వర్‌ డౌన్‌.. ఇద్దరిపై వేటు

మరిన్ని వార్తలు