దావూద్‌ పూర్వీకుల ఆస్తులు వేలం

21 Oct, 2020 14:28 IST|Sakshi

ముంబై: భారత్‌తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్​ వరల్డ్​ డాన్​, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్​ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(ఎస్‌ఏఎఫ్‌ఎంఏ) కింద ఈ వేలం ప్రక్రియ జరగనుంది. మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకణ్‌లో దావూద్ పూర్వీకులకు చెందిన స్థిరాస్థులు ఉన్నాయి. వీటిని నవంబర్ 10న వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా,ఆస్తుల వేల్యువేషన్​ ప్రక్రియ గతేడాదే ముగిసిన విషయం తెలిసిందే. రత్నగిరి జిల్లా ఖేడ్​ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్​ పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్​కు స్థిరాస్తులు ఉన్నాయి. (చదవండి: మాతోశ్రీని పేల్చేస్తాం)

1980లలో ఇక్కడ ఉన్న బంగ్లాలోనే దావూద్​ కుటుంబ సభ్యులు నివాసముండేవారు. దీనిని దావూద్​ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దావుద్​ కుటుంబసభ్యులు దీనిని విడిచిపెట్టారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది శిథిలావస్థకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే పరిస్థితికి నెలకొంది. తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్​ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీటి విలువ కోటి రూపాయలు ఉండనున్నట్లు తెలిసింది. కాగా, 1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు దావూద్. అలాగే దావూద్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లను కూడా అదే రోజున వేలం వేస్తారు. వచ్ఛే నెల 2 న బిడ్డర్ల పరిశీలన జరుగుతుంది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా