‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే..

21 Nov, 2021 14:59 IST|Sakshi

యుద్ధనౌకను లాంఛనంగా ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

విశాఖ పేరిట యుద్ధనౌక తయారీపై ఉత్తరాంధ్ర ప్రజల్లో సంతోషాలు

75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక

ముంబై: విశాఖపట్నం అంటే సముద్ర తీరంలోని ఓ నగరం గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఓ యుద్ధ నౌక కూడా విశాఖపట్నం పేరిట నిర్మితమైంది. విశాఖ నగర ప్రాధాన్యత తో పాటు చరిత్ర ఆధారంగా నేవీ ఓ యుద్ధ నౌకకు విశాఖపట్నం నామకరణం చేసింది. ఈ యుద్ధనౌక ప్రాధాన్యతలను ఇటీవల  తూర్పు నౌకాదళ ప్రధానాధికారి  వైఎస్‌ అడ్మిరల్‌ ఆజేంద్ర బహదూర్ సింగ్ తాడేపల్లిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కూడా వివరించారు. ఆదివారం ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ‘విశాఖపట్నం యుద్ధనౌక’ను ప్రారంభించారు. ఈ యాంటీ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక రక్షణ రంగంలో కీలక భూమిక పోషించనుంది.

చదవండి: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్‌ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు

విశాఖ నగరానికి రక్షణ రంగానికి ఎంతో అనుబంధం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం నుంచి విశాఖ నగరంపై శత్రుదేశాల దృష్టితో పాటు ఈ నగరం కేంద్రంగా శత్రు దేశాలు ఎదుర్కోడానికి భారత్ రక్షణ దళం కూడా ప్రత్యేక స్థావరాలు కొనసాగించింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో కైలాసగిరి.. యారాడ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేక సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అరకులో పద్మాపురం గార్డెన్స్ నుంచి సైనికులకు కూరగాయలు ప్రత్యేకంగా సరఫరా చేసేవాళ్లు. 1971లో పాకిస్తాన్‌పై భారత్ విజయం సాధించడంలో విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న తూర్పు నౌకాదళం ప్రధాన భూమిక పోషించింది.

దీనికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దశలో విశాఖ నగర ఖ్యాతి ప్రాధాన్యతను గుర్తిస్తూ నావికాదళం ఇటీవల విశాఖపట్నం అని పేరు పెట్టింది. 2011 జనవరి 18 నుంచి  రూపకల్పన జరిగిన ఈ యుద్ధనౌక డైరెక్టర్ ఆఫ్ నావెల్ డిజైన్. ఇండియన్ నేవీ సంయుక్తంగా యుద్ధనౌక రూపకల్పన డిజైన్ చేసింది గంటకు 30 నాటికా మైళ్ల వేగంతో ప్రయాణం చేసే యుద్ధనౌక ఏకదాటిగా నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే సామర్థ్యం పూర్తిగా 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ విశాఖపట్నం మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక సముద్రంలో ట్రయిల్  రన్ పూర్తిచేసుకుని రక్షణ రంగంలో సేవలకు సిద్ధమైంది.

ముంబైలో రూపొందిన ఈ యుద్ధనౌకను గత నెల 31వ తేదీన తూర్పు నౌకాదళ అధికారులకు అప్పగించారు. ఈ దశలో ఈ యుద్ధ నౌక విశాఖ కేంద్రం సేవలు అందించనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించిన దశలో ఆ నగరం పేరిట యుద్ధనౌక రూపొందడం గొప్ప విషయంగా ప్రజలు భావిస్తున్నారు. దీన్ని లాంఛనంగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభించడంపై విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు