ఢిల్లీ లిక్కర్ స్కాం: కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు

18 Dec, 2023 18:33 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అధికారులు మరోమారు ప్రశ్నించనున్నారు. డిసెంబర్ 21న హాజరవ్వాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.  

ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ నవంబర్ 2న కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈ కేసులో కేజ్రీవాల్‌నుసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. ఈ కేసులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. 

మద్యం కుంభకోణంలో అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. అదే రోజు ఆయన నివాసం సహా సంబంధించిన ఆస్తులపై సోదాలు చేసింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనీస్ సిసోడియాను ఫిబ్రవరి  26న ఈడీ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

ఢిల్లీ ప్రభుత్వం 2022లో నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఈ విధానంలో భాగంగా కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బును గోవా సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఫండ్ కోసం వినియోగించారని ఈడీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ప్రభుత్వం ఖండిస్తోంది. 

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు

>
మరిన్ని వార్తలు