మహదేవ్‌ బెట్టింగ్‌ స్కామ్‌: కీలక నిందితుడి అరెస్టు!

13 Dec, 2023 09:13 IST|Sakshi
photo courtesy:THE BUSINESS RULE

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌లో ప్రధాని నిందితుడు రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో ఇంటర్‌పోల్‌ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్‌ రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

త్వరలో రవిని భారత్‌ తీసుకువచ్చేందుకు ఈడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో రాయ్‌పూర్‌ పీఎంఎల్‌ఏ కోర్టులో ఇప్పటికే ఈడీ రవి ఉప్పల్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. రవి తన భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకోకుండానే వనాతు ఐలాండ్‌ పాస్‌పోర్టుతో దుబాయ్‌లో ఉంటున్నట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌లో రూ.6 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఈడీ పేర్కొంది. ఆశిమ్‌ దాస​ అనే కొరియర్‌ ద్వారా రూ.508 కోట్ల ముడుపులను మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బాగేల్‌కు చెల్లించారని అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయగా దీనికి పూర్తి విరుద్ధంగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 

ఇదీచదవండి..డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్‌

>
మరిన్ని వార్తలు