సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై క్రమశిక్షణా చర్యలు!

5 Aug, 2021 04:15 IST|Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డిపార్ట్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(డీఓపీటీ)కి సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సర్వీసు రూల్స్‌ ఉల్లంఘించడం వంటి ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఈ మేరకు సిఫారసు చేస్తూ డీఓపీటీకి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఆరోపణలు రుజువైతే అలోక్‌ పెన్షన్, రిటైర్మెంట్‌ ప్రయోజనాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలోక్‌ 2017 ఫిబ్రవరి 1న సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కొనసాగారు. అప్పుడే తన కింద పని చేసే మరో అధికారి రాకేశ్‌ ఆస్తానాతో తగాదా పెట్టుకున్నారు. ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ చేసిన సిఫార్సును డీఓపీటీ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కి పంపించింది. 

మరిన్ని వార్తలు