ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. డాక్టర్‌ దంపతులు సహా ఐదుగురు మృతి

29 Jan, 2023 06:25 IST|Sakshi

ధన్‌బాద్‌: జార్ఖండ్‌ రాష్ట్రం ధన్‌బాద్‌లోని ఓ నర్సింగ్‌ హోంలో శనివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో డాక్టర్‌ దంపతులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ధన్‌బాద్‌లోని బ్యాంక్‌ మోర్‌ ఏరియాలో డాక్టర్‌ వికాస్‌ హజ్రాకు చెందిన నర్సింగ్‌ హోం ఉంది. ఆయన కుటుంబంతోపాటు అందులోనే నివాసం ఉంటారు.

ఆస్పత్రి స్టోర్‌రూంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న డాక్టర్‌ వికాస్‌ హజ్రా(64), భార్య డాక్టర్‌ ప్రేమ హజ్రా(58), బంధువు సోహన్‌ కుమారి, పనిమనిషి తారాదేవి దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారు. మృతి చెందిన ఐదో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఘటనలో డాక్టర్‌ దంపతుల పెంపుడు కుక్క కూడా చనిపోయింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు