ఈవీఎం తరహాలో ఆర్‌వీఎం.. ఇక సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటేయొచ్చు!

29 Dec, 2022 14:22 IST|Sakshi

ఢిల్లీ: దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఓటింగ్‌ శాతం గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. ఓటింగ్‌ శాతంలో వ్యత్యాసం బాగా కనిపించింది. సాంకేతికతంగా అభివృద్ధి చెందినా.. వలస ఓటర్లు దూరం అవుతుండడం సరికాదనే అభిప్రాయంలోకి ఉంది కేంద్రం ఎన్నికల సంఘం. 

ఎన్నికల సమయంలో ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు వలస వెళ్లిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం, డబ్బు.. రెండూ వృథా అవుతాయనే ఆలోచనతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో.. వాళ్ల ఓటింగ్‌ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌(RVM)పద్ధతిని తీసుకురాబోతోంది. తద్వారా సొంత ఊళ్లకు వెళ్లకుండానే ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

ఈ ఓటింగ్‌ టూల్‌ ద్వారా వలస ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉన్న చోటు నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒక రిమోట్‌ పోలింగ్‌ బూత్‌ నుంచి ఆర్‌వీఎం ద్వారా 72 నియోజకవర్గాల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.   ఈ కొత్త సాంకేతిక విధానాన్ని రాజకీయ పార్టీలకు వివరించేందుకు ఇప్పటికే ఈసీ ఆహ్వానించింది కూడా.  ఈ నమునాను వివరించే కార్యక్రమం 2023 జనవరి 16వ తేదీన జరగనుంది. 

ఈ విధానంతో పాటు టూ వే మెథడ్‌ ఫిజికల్‌ ట్రాన్సిట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌, ప్రాక్సి ఓటింగ్‌, స్పెషల్‌ ఎర్లీ ఓటింగ్‌, ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ బాలెట్స్‌(వన్‌ వే లేదంటే టూ వే), ఇంటర్నెట్‌ బేస్డ్‌ ఓటింగ్‌ సిస్టమ్‌.. ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలను పరిశీలించింది కూడా.  దేశంలో రాష్ట్రాల మధ్యే 85 శాతం అంతర్గత వలసలు సాగుతున్నట్లు ఒక అంచనా. కేంద్రం వద్ద ఈ వలసల లెక్కలు లేకపోయినా.. పనులు, వివాహాలు, చదువు తదితర కారణాలతో ఇలాంటి వలసలు కొనసాగుతున్నాయన్నది పలు విశ్లేషణల ద్వారా తేలింది.

మరిన్ని వార్తలు