-

Rahul Gandhi: రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు రాజ్యాంగబద్ధమేనా?

25 Mar, 2023 08:29 IST|Sakshi

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేటు రాజ్యాంగబద్ధమేనని కొందరు, లోక్‌సభ సెక్రటేరియట్‌ సరైన నిర్ణయం తీసుకోలేదని మరికొందరు అంటున్నారు. 2014 నాటి లిల్లీ థామస్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు వెంటనే అనర్హతకు గురవుతారని వెల్లడించింది. శిక్ష పడిన మర్నాడే రాహుల్‌పై వేటుకు ఈ తీర్పు దోహదపడినట్లు తెలుస్తోంది.

అయితే 2018 నాటి లోక్‌ప్రహరీ వర్సెస్‌ భారత ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు మరో తీర్పు ప్రకటించింది. అనర్హత వేటు పడిన ప్రజాప్రతినిధిపై అభియోగాలను పైకోర్టు కొట్టేస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. శిక్ష రద్దయితే వేటూ రద్దవుతుందని తెలియజేసింది. రాహుల్‌పై వేటు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(1)(ఈ), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(3)ని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఉదాహరించింది. వీటి ప్రకారం రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన సభ్యులపై శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆరేళ్ల దాకా ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయవచ్చు.

కానీ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(4) ప్రకారం శిక్ష పడిన 3 నెలల తర్వాత మాత్రమే అనర్హత ప్రక్రియ ప్రారంభం కావాలి. ఈలోగా శిక్షపడిన సభ్యుడు పై కోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చు. కింది కోర్టు తీర్పును పై కోర్టు కొట్టివేసే అవకాశం ఉంది. కానీ, రాహుల్‌పై వెంటనే వేటు వేయడం గమనార్హం. ఇలా శిక్ష పడిన మరుసటి రోజే సభ్యులపై అనర్హత వేటు వేసిన దాఖలాలు గతంలో లేవు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్‌ 8(4)ను లోక్‌సభ సెక్రటేరియట్‌ పట్టించుకోలేదని నిపుణులు చెబుతున్నారు. లోక్‌ప్రహరీ కేసు ప్రకారం.. రాహుల్‌కు పడిన జైలుశిక్షను పై కోర్టు రద్దు చేస్తే ఆయనపై అనర్హత వేటు సైతం రద్దవుతుంది. 

మరిన్ని వార్తలు