-

అలిగిన గ్రామీణం.. ఎన్నికల బహిష్కరణ మంత్రం

26 Nov, 2023 19:01 IST|Sakshi
ఎన్నికలను బహిష్కరించడంతో నిర్మానుష్యంగా ఉన్న పాలావాలా జతన్ గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం

Rajasthan elections 2023: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మిజోరాం, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇప్పటికే ఎన్నికలు పూర్తవ్వగా తెలంగాణలో నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది.  ఐదేళ్లకు ఒక సారి వచ్చే ఎన్నికల ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అయితే ప్రభుత్వాల ఉదాసీనత, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన పలు గ్రామాలు ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తున్నాయి. శనివారం జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అనేక గ్రామాలు బహిష్కరించాయి.

తాగునీటి సమస్యపై.. 
హనుమాన్‌గఢ్ జిల్లాలోని టిబ్బి తహసీల్‌ పరిధిలోని దౌలత్‌పురాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ కపిల్ యాదవ్‌కు మెమోరాండం సమర్పించారు.  గ్రౌండ్ లెవల్‌లో దెబ్బతిన్న వాటర్ ట్యాంక్, ఫిల్టర్లను పునర్నిర్మించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని మెమోరాండంలో పేర్కొన్నారు.

అలాగే శ్రీగంగానగర్ జిల్లాలోని సూరత్‌గఢ్ తహసీల్‌కు చెందిన తుక్రానా పంచాయతీ ఫరీద్‌సర్ గ్రామ ప్రజలు కూడా తాగునీటి సమస్యపై నిరసనగా ఓటింగ్‌ను బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు సూరత్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్‌కు మెమోరాండం ద్వారా తెలియజేశారు.

ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం
రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజా ప్రతినిధులపై ఆగ్రహంతో కూడిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం భిల్వారా జిల్లా నుంచి తొలగించి షాపురా జిల్లాలో చేర్చిన ఎనిమిది గ్రామ పంచాయతీల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. భిల్వారాను విభజించి షాపురా జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు మండల్‌గర్ సబ్‌డివిజన్‌లోని 16 పంచాయతీలు షాపురా జిల్లాలో చేర్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల తరువాత, ప్రభుత్వం వీటిలో ఎనిమిది పంచాయతీలను తిరిగి భిల్వారాలో చేర్చింది. మిగిలిన ఎనిమిది షాపురాలోనే ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా పోస్టర్లు అంటించి నిరసనలు చేపట్టారు.

ఏకంగా 50 గ్రామాలు
ఇక జైసల్మేర్ జిల్లాలోని సోను గ్రామంలో గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు సంఘీభావంగా 50 గ్రామాలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించాయి. సోను గనుల నుంచి సున్నపురాయిని రవాణా చేయడానికి ఈ ప్రాంతంలో దాదాపు 400 ట్రక్కులు ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్లు సరుకు రవాణా ఛార్జీలను టన్నుకు రూ.3 పెంచాలని కోరుతున్నారు. అయితే రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ కాంట్రాక్టర్ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు సమీపంలోని 50 గ్రామాల ప్రజలు లారీ డ్రైవర్లకు మద్దతుగా నిలిచారు.

సికార్ జిల్లాలోని నీమ్ కా థానా తహసీల్‌కు చెందిన లాడి కా బస్ గ్రామస్థులు తమ గ్రామ పంచాయతీని అజిత్‌గఢ్ పంచాయతీ సమితి నుంచి తొలగించి పటాన్ పంచాయతీ సమితిలో తిరిగి చేర్చాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూ గ్రామస్తులు ఆరుసార్లు ఎన్నికలను బహిష్కరించారు.  

రోడ్డు సమస్య.. 
ఝలావర్ జిల్లాలోని ఓద్‌పూర్ గ్రామస్థులు రాష్ట్ర రహదారికి సరైన రహదారిని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అదేవిధంగా కోటా జిల్లాలోని సంగోడ్ తహసీల్‌లోని లాడ్‌పురా రైతులు తమను చంబల్ నది నుంచి నీటిని వాడుకునేందుకు అనుమతించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు. టోంక్ జిల్లాలోని డియోలి గ్రామస్తులు తమ రోడ్డును బాగు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన మార్గాల్లో కాంక్రీట్ రోడ్లు నిర్మించకపోతే బహిష్కరిస్తామని టోంక్ జిల్లాలోని సీసోలా ప్రజలు హెచ్చరించారు. 

అదే విధంగా ధోల్‌పూర్ జిల్లా బసేరి అసెంబ్లీ నియోజకవర్గం చంద్రావళి గ్రామ ప్రజలు దశాబ్ద కాలంగా తమ గ్రామ రహదారికి మరమ్మతులు చేపట్టలేదని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక భిల్వారాలోని 43వ వార్డు ప్రజలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించడమే కాకుండా రాజకీయ నేతలను తమ వార్డులోకి రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నేతలను హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. 

జైపూర్‌ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ బూత్‌​వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్‌ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు