Heavy Rains In Karnataka: అతి భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

7 Jul, 2022 11:49 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. ఓ పక్క ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు కర్ణాటకలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని  తీరప్రాంత జిల్లాల్లో (కొడగు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి) అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ అంచనా వేయడంతో కోస్తా కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు అధికారులు పూర్తిగా మూసేశారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు విడిచారు.

సీఎం ఆదేశం
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధికారులను అ‍ప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, ముంపు ప్రాంతాల ప్రజలను తాత్కాలిక, శాశ్వత పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాల డిప్యూటీ కమీషనర్లను తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.
చదవండి: మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మూడు రోజులపాటు ఇలాగే 


ఆస్తి నష్టం
భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని  అనేక ప్రాంతాలు నీట‌మునిగాయి. తీరప్రాంతాలు, మల్నాడు ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు నెకొరగడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. నదులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు వ్యవసాయ పొలాలును ముంచెత్తాయి. 
చదవండి: Corona Updates: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు..

మంగళూరు జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని పంజికల్లు గ్రామం వద్ద బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో పొలంలో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు మట్టిలో చిక్కుకున్నారు.వీరిలో ముగ్గురిని రక్షించగా, ఇద్దరు గురువారం ఉదయం మరణించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు