‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!!

5 Dec, 2020 01:38 IST|Sakshi
ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో రోడ్డుపైనే రైతుల భోజనాలు

సాగు చట్టాలపై రైతన్న ఆగ్రహం

స్వల్ప సవరణలకు కేంద్రం అంగీకారం

ససేమిరా అంటున్న రైతులు

రైతే ఒక పారిశ్రామికవేత్తగా మారేలా వ్యవసాయ రంగంలో చరిత్రాత్మక చట్టాల్ని తీసుకువచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే  చెప్పుకున్నారు. కానీ ఆ చట్టాలను రద్దు చేయాలంటూ గత పది రోజులుగా ఢిల్లీ వీధుల్లో బైఠాయించిన రైతన్నలు చరిత్ర సృష్టిస్తున్నారు. ఆహార ధాన్యాల సేకరణ ఎక్కువగా ఉండే  పంజాబ్, హరియాణా రైతులు పోరాటానికి తొలి అడుగు వేస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల రైతులు వారి అడుగులో అడుగు వేసి కదం తొక్కారు. ఈ చట్టాల అమలుతో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ జరుగుతుందన్న ఆందోళన అన్నదాతల్ని వెంటాడుతోంది.

అందుకే నిత్యావసర సరుకుల సవరణ చట్టం..  రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య  ప్రోత్సాహక చట్టం...  రైతుల సాధికారత, రక్షణ ధరల హామీ సేవల ఒప్పంద చట్టాలను వెనక్కి తీసుకోవాలని, మద్దతు ధరను చట్టంలో చేర్చాలని రేయింబగళ్లు నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాల లక్ష్యంలోనే తప్పులు ఉన్నాయని రైతు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ‘ఏదైనా చట్టం లక్ష్యమే తప్పుగా ఉంటే దానిలో సవరణలు చేసినా అవి తప్పుదారి పడతాయి. దాని వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు’’ అని 40 మంది రైతులున్న ప్రతినిధి బృందంలోని ఏకైక మహిళా కవితా కురుగంటి తెలిపారు.

పీట ముడి ఎక్కడ ?
సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్‌పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్‌ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది. ఎంఎస్‌పీపై రైతులను విపక్షాలు పక్కదారి పట్టిస్తున్నాయనీ, అందుకే రైతులు ఆందోళన తీవ్ర చేస్తున్నారన్నది కేంద్రం ఆరోపిస్తోంది.

రైతుల అభ్యంతరాలు, డిమాండ్లు..
వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.  ఒకే దేశం ఒకే మార్కెట్‌ విధానం వల్ల భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అన్నదే లేకుండా పోతుంది. మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుందంటున్నారు.  అందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.

కేంద్రం ఏమంటోంది ?  
► వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా కుదరదని తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలకు అంగీకరించింది.  
► కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ ద్వారా బడా కంపెనీలు రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.  
► మండీల్లో ప్రైవేటు వ్యక్తులు వస్తే పోటీ ఉండి రైతులకే ప్రయోజనమని వాదిస్తున్న కేంద్రం రాష్ట్రాల పరిధిలో నడిచే మండీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒప్పుకుంది. ప్రైవేటు మార్కెట్లు, ప్రభుత్వ మార్కెట్‌ యార్డుల్లో పన్నులు సమానంగా వసూలు చేయడానికి అంగీకరించింది.  
► ప్రైవేటు వ్యాపారులు పాన్‌ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి బదులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.  
► కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని, దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని పదే పదే చెబుతూ వస్తోంది.   

మరిన్ని వార్తలు