Rajasthan Assembly elections 2023: అల్లర్లు, అవినీతిలో రాజస్తాన్‌ టాప్‌

19 Nov, 2023 05:27 IST|Sakshi

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శ

జైపూర్‌: నేరాలు, అవినీతి, అల్లర్లలో రాజస్తాన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్లిందని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. శనివారం రాజస్తాన్‌లోని భరత్‌పూర్, నాగౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గెహ్లాత్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఓవైపు విశ్వవిజేతగా భారత్‌ ప్రభవిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌లో ఏం జరుగుతోందో మీకందరికీ తెల్సిందే. అల్లర్లు, నేరాల నమోదులో రాజస్తాన్‌ అగ్రపథంలో దూసుకుపోతోంది.

బుజ్జగింపు రాజకీయాల కారణంగా సంఘ విద్రోహ శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఈసారి మీకు ఓట్లు వేయబోము అని మెజీషియన్‌కు ఓటర్లు చెప్పేశారు. ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అదృశ్యమవుతుంది. డిసెంబర్‌ మూడున కాంగ్రెస్‌ మాయమవడం ఖాయం’’ అని గెహ్లోత్‌నుద్దేశిస్తూ మోదీ విమర్శించారు. చిన్నతనంలో తండ్రికి సాయపడుతూ గెహ్లోత్‌ మెజీషియన్‌గా దేశపర్యటన చేసిన సంగతి తెల్సిందే. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ మూడో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.

వారెక్కడుంటే నేరాలు అక్కడ
‘ ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలువుతీరాయో అక్కడ నేరగాళ్లు, ఉగ్రవాదులు, అల్లర్లు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్‌ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టిందిపేరు. ప్రజల జీవితాలను పణంగా పెట్టేందుకు ఎంతగా దిగజారేందుకైనా కాంగ్రెస్‌ సిద్ధం. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో మహిళలు, దళితులపై నేరాలు ఎక్కువయ్యాయి. హోలీ, శ్రీ రామనవమి, హనుమాన్‌ జయంతి.. ఏ పర్వదినమైనా సరే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకున్నదే లేదు. ఎప్పుడూ అల్లరిమూకల దాడులు, ఘర్షణలు, వివాదాలు, కర్ఫ్యూ.. ఇవే రాజస్తాన్‌లో దర్శనిమిచ్చాయి.

మహిళలు అబద్ధపు రేప్‌ కేసులు పెడుతున్నారని స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి మహిళలను రక్షిస్తారా?. ఈయనకు ఒక్క నిమిషమైనా సీఎం కుర్చీలో కూర్చొనే హక్కు ఉందా?’’ అని మోదీ మండిపడ్డారు. ‘మగాళ్లు ఉన్న రాష్ట్రం కాబట్టే రాజస్తాన్‌లో రేప్‌లు ఎక్కువ అంటూ మంత్రి శాంతికుమార్‌ ధరివాల్‌ మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలు ఉన్నందుకు కాంగ్రెస్‌ పార్టీ సిగ్గుపడాలి. అసెంబ్లీలో ఇంత దారుణంగా మాట్లాడినా ఈ మంత్రిపై ఎలాంటి శిక్షలు లేవు. ఎందుకంటే సీఎం రహస్యాలు ఈయనకు తెలుసు మరి. పైగా ఈయనకు రివార్డ్‌గా టికెట్‌ దక్కింది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.

దళితుడు ఉన్నతాధికారి కావడం ఇష్టం లేదు
‘‘ దళితులపై కాంగ్రెస్‌ వివక్ష చూపుతోంది. డీగ్‌ జిల్లాకు చెందిన హీరాలాల్‌ సమరియా ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి స్వీకరించిన తొలి దళితుడు ఆయన. ఈయన ఎంపిక సమావేశాన్ని కాంగ్రెస్‌ బాయ్‌కాట్‌ చేసింది. దళిత అధికారి అంతటి ఉన్నతస్థాయికి చేరుకోవడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు, ఇంధన ధరల పెరుగుదలకు గెహ్లోత్‌ సర్కారే కారణం. పొరుగు ఉన్న రాష్ట్రాల్లో కంటే రాజస్తాన్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.12 ఎక్కువ ధర. మేం అధికారంలోకి
రాగానే ధరలను సమీక్షించి, సవరిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు