ఐసీయూలో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

9 Nov, 2021 10:21 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో తీవ్ర విషాదం

ఆస్పత్రి ఐసీయూలో అగ్ని ప్రమాదం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. 

సంఘటన చోటు చేసుకున్న  సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 25 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు. 


(చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..)

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ‘‘కమలా నెహ్రూ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన పట్ల విచారం వ్య​క్తం చేస్తున్నాను. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాను. ఏసీఎస్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మహ్మద్ సులేమాన్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుంది’’ అన్నారు.


(చదవండి: ‘జోకర్‌’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు)

ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చామని.. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

చదవండి: రూ.90 కోట్ల విలువైన మద్యం దగ్ధం

మరిన్ని వార్తలు