చేదు మిగిల్చిన షుగర్‌ వ్యాధి.. వేదన చూడలేక కుటుంబమంతా..

28 Dec, 2022 07:15 IST|Sakshi
యువరాజ్, పాన్‌విళి, నితీషా, అక్షర (ఫైల్‌)  

సాక్షి, తమిళనాడు: బిడ్డలు మధుమేహం (షుగర్‌) బారిన పడడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చికిత్స అందిస్తున్నా.. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో తట్టుకోలేకపోయారు. దీంతో కుటుంబమంతా పాలారులో దూకి మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. సేలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

వివరాలు.. సేలం నగరంలో పరిధిలోని దాదగాపట్టి నెసవాలర్‌ కాలనీకి చెందిన యువరాజ్‌ (35) పాన్‌విళి (30) దంపతులకు నితీషా (7), అక్షర (5) అనే కుమార్తెలున్నారు. నితీషా మూడేళ్ల క్రితం మధుమేహం బారిన పడింది. అప్పటి నుంచి బాలికకు చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో మూడు రోజుల క్రితం అక్షర కూడా మధుమేహం బారినపడినట్టు వైద్య పరిశోధనల్లో తేలింది. దీంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ కుమార్తెలిద్దరూ పడుతున్న వేదనను చూసి తట్టుకోలేక పోయారు.

ఈ క్రమంలో సోమవారం యువరాజ్‌ తన తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లకు ఓ లేఖ రాసి పెట్టి కుటుంబంతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మేట్టూరు సమీపంలోని తమిళనాడు – కర్ణాటక సరిహద్దుల్లోని ఈరోడ్‌ జిల్లా పరిధిలోని అడి పాలారు నదిలో యువరాజ్, పాన్‌విలి, నితిషా, అక్షర మృతదేహాలు మంగళవారం సాయంత్రం తేలాయి.

సమాచారం అందుకున్న భవానీ డీఎస్పీ అమృత వర్షిణి ఘటనా స్థలానికి చేరుకుని ఆ నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అందియూరు జీహెచ్‌కు తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ లేఖ ఆధారంగా కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారించారు.   

మరిన్ని వార్తలు