డయాబెటిస్‌కి నిలయంగా భారత్‌?! 10 కోట్ల మందికిపైగా..!

13 Nov, 2023 15:50 IST|Sakshi

దీర్థకాలిక వ్యాధి అయిన డయాబెటిస్‌(మధుమేహం.. షుగర్‌ వ్యాధి) రోగుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అది కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారినపడుతున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నట్లుగానే వ్యాధుల పరంగానూ తగ్గేదేలే! అన్నట్లు తొందరగా ఈ వ్యాధి బారినపడిపోతున్నారు. ఎందువల్ల?.. ఇంతలా అన్ని వనరులు అందుబాటులో ఉండి, ముఖ్యంగా చదువుకున్నవాళ్లే ఈ అనారోగ్యం బారినపడటానకి కారణం. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోలేమా? లేదా రాకుండా చూసుకోలేమా తదితరాల గురించే ఈ కథనం!.

ఇండియన్‌ కౌన్సిల్‌ మెడికల్‌ రీసెర్చ్(ఐసీఎంఆర్‌) ప్రకారం.. నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన అధ్యయనంలో భారత్‌లోనే దాదాపు 101 మిలియన్ల మంది(10 కోట్ల మందికి పైనే) మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఇది దేశ జనాభాలో సుమారు 11.4%. అంతేగాదు గతేడాది 2019 నుంచి 2021 మధ్యలోనే సుమారు 31 మిలియన్ల(మూడు కోట్ల) మధుమేహ కేసులు నమోదయ్యాయి. కానీ, ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 80 మిలియన్లదాక(ఎనిమిది కోట్ల) కేసులు నమోదు అయినట్లు ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. ఆ సంఖ్య కాస్తా 2045 నాటికి 135(పదమూడున్నర కోట్లకు) మిలియన్లకుపైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. డయాబెటిస్‌ కేసుల పరంగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో భారత్‌ డయాబెటిస్‌కి నిలయంగా మారుతుందా అనేంతగా కేసులు వేగవంతంగా పెరిగిపోతున్నాయి. 

భారత్‌లోనే ఎందుకు అధికం..
ప్రపంచ జనాభాలో భారతీయులు మధుమేహ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువ. పలు అధ్యయనాలు ఇన్సులిన్‌ నిరోధకతను అభివృద్ధి చేయలేకపోతున్నట్లు వెల్లడైంది. వారి ప్రత్యేకమైన శరరీ కూర్పు కూడా ఇందుకు కారణమని పరిశోధనలు తెలిపాయి. పొత్తికడుపు పెద్దగా ఉండి కొవ్వు పేరుకుపోవడం, తక్కువ కండర ద్రవ్యరాశి తదితరాలు మధుమేహ సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నట్ల పేర్కొన్నాయి అధ్యయనాలు. దీనికి తోడు భారతదేశంలో వేగవంతమైన పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి  వంటివి శారీరక శ్రమ స్థాయిల్లో మార్పులకు దారితీసింది.

అంతేగాక మనవాళ్లు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, సంతృప్త కొవ్వులు ఎక్కువుగా తీసుకుంటారు. ఇవి రక్తంలో గ్లూకోజ్‌, కొలస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి. పట్టణీకరణ నేపథ్యంలో భారతీయుల చేసే ఉద్యోగాలన్నీ నిశ్చలంగా ఒకే చోట కూర్చొని చేసేవే అయ్యిపోయాయి. మరోవైపు పచ్చని ప్రదేశాలు కూడా కనుమరగయ్యాయి. వీటన్నిట్లకి తగ్గట్టుగానే ఇంకోవైపు నుంచి పర్యావరణ కాలుష్యం, వాయు, జల కాలుష్యాలు భారత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని వాయు కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయిలో ఉందో తెలిసిందే. ఇవన్ని భారతీయ ప్రజల్లో రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడమేగాక ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే అవయమైన ప్యాంక్రియాస్‌ పనితీరును దారుణంగా దెబ్బతీస్తోంది. అందువల్లే ఈ మదుమేహ వ్యాధి భారత్‌లోనే అధికంగా ఉంటోంది. ప్రజలు కూడా సరైన జీవనశైలిని పాటించకపోవడంతో చాలా ఈజీగా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారినపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

నవంబర్‌ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవం.. ఈ సందర్భంగా పై ప్రత్యేక కథనం 

(చదవండి:   డయాబెటిస్‌ డే ఎందుకు జరుపుకుంటున్నాం? నియంత్రించాలంటే..?)

మరిన్ని వార్తలు