అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?

20 Aug, 2023 08:57 IST|Sakshi

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ అజయ్ రాయ్ ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇదే స్థానంలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 1967లో ఏర్పడిన అమేథీ.. నాటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. గత నాలుగు సంవత్సరాలుగా 1970-1990వ దశకాల ప్రారంభంలో మినహా, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారు లేదా వారి విధేయులు ఈ నియోజకవర్గంలో గెలుపొందుతూ వస్తున్నారు. అమేథీతో నెహ్రూ-గాంధీ కుటుంబానికి గల దశాబ్దాల నాటి సంబంధం గురించి ఇప్పుడు తెలుకుందాం. 

సంజయ్ గాంధీ (1980–81)
గాంధీ-నెహ్రూ కుటుంబంలో అమేథీ లోక్‌సభ నుంచి పోటీ చేసిన తొలి వ్యక్తి సంజయ్ గాంధీ. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే జరిగిన 1977 లోక్‌సభ ఎన్నికల్లో సంజయ్ అమేథీ నుంచి పోటీ చేశారు. అయితే జనాభా నియంత్రణ కోసం సంజయ్‌ చేపట్టిన బలవంతపు స్టెరిలైజేషన్ కార్యక్రమం కారణంగా అతను ఘోరమైన ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. నాటి ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రవీంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. సంజయ్ గాంధీ తిరిగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ  చేసి, ఎంపీ అయ్యారు. అయితే 1981లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్‌ మరణించారు. అమేథీ ఎంపీగా స్వల్పకాలమే పనిచేశారు.

రాజీవ్ గాంధీ (1981–1991)
సంజయ్ మరణంతో రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981 మే 4న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుని పేరును అమేథీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సభ్యులందరూ ఈ సూచనను ఆమోదించారు. అనంతరం రాజీవ్ అమేథీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. రాజీవ్ నాటి ఉప ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించారు. లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీవ్ 1981 ఆగస్టు 17న అమేథీ నుంచి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత  కూడా రాజీవ్ 1984, 1989,1991లో అమేథీ నుండి గెలిచారు. దాదాపు దశాబ్దం పాటు ఈ సీటును నిలబెట్టుకున్నారు. 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత అమేథీలో తిరిగి ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ శర్మ విజయం సాధించారు. 1996 ఎన్నికల్లోనూ ఆయన తన విజయాన్ని పునరావృతం చేశారు.


ఇది కూడా చదవండి: నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!

సోనియా గాంధీ (1999–2004)
1999లో రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ అమెథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఇక్కడి జనం నెహ్రూ-గాంధీ కుటుంబానికిచెందిన చెందిన నేతకు మరోసారి ఓటు వేశారు. అయితే అదే స్థానం నుంచి ఆమె మరోమారు ఎన్నికల బరిలోకి దిగలేదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా స్వయంగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయగా, రాహుల్ గాంధీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

రాహుల్ గాంధీ (2004-2019)
రాహుల్ తన తొలి ప్రయత్నం(2004)లోనే అమేథీ నుంచి గెలుపొందారు. 2009లో 3.70 లక్షల ఓట్ల భారీ తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. 2014లో కూడా రాహుల్‌ ఇక్కడి నుంచే గెలిచారు. అయితే నాడు అతని ప్రత్యర్థి స్మృతి ఇరానీ అతనికి గట్టి పోటీనిచ్చారు. అయితే స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ మళ్లీ అమేథీలో సత్తా చాటుతారని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం ఇందుకు కలసివస్తాయనే అంచనాలున్నాయి.


ఇది కూడా చదవండి: కళలతో కోట్లు.. వీరి టర్నోవర్‌ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..!

మరిన్ని వార్తలు