కొత్త పార్టీపై ఆజాద్‌ కీలక ప్రకటన.. 400 మందిని కలిశానంటూ వ్యాఖ్యలు!

11 Sep, 2022 15:24 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్‌.. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్‌ తీరు, రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, ఆజాద్‌ ఇప్పటికే.. కశ్మీర్‌లో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, కొత్త పార్టీపై ఆజాద్‌ తాజాగా మరిన్ని విషయాలు వెల్లడించారు. జమ్మూలో ఆదివారం ఆజాద్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆజాద్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే తాను కాంగ్రెస్‌ పార్టీని వీడిన తర్వాత.. తనకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగినట్టు స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుంగా తనకు సపోర్టు నిలిచారని అన్నారు. 

మరోవైపు.. తాను రాజీనామా చేసి కశ్మీర్‌కు వచ్చిన తర్వాత జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నట్టు చెప్పారు. వారంతా తనకు మద్దతు తెలిపారని, ఏ పార్టీ అయినా తనతో నడుస్తానని చెప్పినట్టు వెల్లడించారు. అలాగే, కశ్మీర్‌ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆజాద్‌ రాజీనామా చేసిన అనంతరం.. కశ్మీర్‌లో దాదాపు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు