జలాంతర్గామి నుంచి ద్వారక దర్శనం

28 Dec, 2023 04:03 IST|Sakshi

భగవాన్‌ శ్రీకృష్ణుడు పరిపాలించిన నగరం ద్వారక. హిందువులకు పరమ పవిత్రమైన ఈ పురాతన నగరం వేలాది సంవత్సరాల క్రితం అరేబియా సముద్రంలో మునిగిపోయింది. నగర ఆనవాళ్లు ఇప్పటికీ సముద్రంలో భద్రంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్ర గర్భంలోని ద్వారకను స్వయంగా దర్శించే అరుదైన అవకాశం భక్తులకు, పర్యాటకులకు లభించనుంది.

జలాంతార్గమిలో ప్రయాణించి, ద్వారకను దర్శించుకోవచ్చు. ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉపరితలం నుంచి 300 అడుగుల మేర లోతుకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. సముద్ర జీవులను కూడా తిలకించవచ్చు. ఈ సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

జలాంతర్గామి యాత్ర రెండు నుంచి రెండున్నర గంటలపాటు ఉంటుందని సమాచారం. ఈ సబ్‌మెరైన్‌ బరువు 35 టన్నులు. లోపల పూర్తిగా ఏసీ సౌకర్యం కలి్పస్తారు. ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఇందులో భక్తులు 24 మంది మాత్రమే ఉంటారు. మిగిలిన ఆరుగురు జలాంతర్గామిని నడిపించే సిబ్బంది, సహాయకులు.

భక్తులకు ఆక్సిజన్‌ మాస్‌్క, ఫేస్‌ మాస్క్, స్కూబా డ్రెస్‌ అందజేస్తారు. అయితే, ద్వారక దర్శనానికి ఎంత రుసుము వసూలు చేస్తారన్న గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించలేదు. జలాంతర్గామిలో ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సామాన్యుల కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ద్వారక కారిడార్‌ అభివృద్ధికి గుజరాత్‌ ప్రభుత్వం డాక్‌ షిప్‌యార్డ్‌ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.   

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

>
మరిన్ని వార్తలు