G20 Summit: తీర్మానాలపై ఎన్నో ఆశలు

8 Sep, 2023 04:48 IST|Sakshi

న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో విస్తృత చర్చల తర్వాత దేశాధినేతలు ప్రపంచ శ్రేయస్సు కోసం ఎలాంటి తీర్మానాలు చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జులైలో జీ20 దేశాల పర్యావరణశాఖ మంత్రుల సదస్సులో శిలాజ ఇంథనాల వినియోగాన్ని దశాలవారీగా తగ్గించడంపై చర్చలో ఏకాభిప్రాయం కుదరనే లేదు. పునరుత్పాదక ఇంథన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికల్లా 11 టెరావాట్లకు తేవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి అంశాల్లోనూ ఉమ్మడి నిర్ణయం తీసుకోలేకపోయాయి.

శిలాజ ఇంధనాలకు బదులు మరో ఇంధన వనరులకు మారడం, బహుళ అభివృద్ధి బ్యాంకు(ఎండీబీ)లో సంస్కరణలు వంటి అంశాల్లో కనీస ఉమ్మడి నిర్ణయాలైనా దేశాధినేతలు తీసుకుంటారేమోనని పలు రంగాల వర్గాలు ఆశగా చూస్తున్నాయి. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు చేకూర్చేలా తక్కువ వడ్డీకి రుణాలు అందేలా ఎండీబీలో సంస్కరణలు తేవాలన్న చర్చ జీ20 శిఖరాగ్ర సదస్సు స్థాయిలో జరగడం ఇదే తొలిసారి.

సంస్కరణలు వాస్తవరూపం దాల్చితే ఎంతో మేలు’ అని క్లైమేట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ సంస్థలో గ్లోబల్‌ పాలసీ విభాగం నేత ఇంద్రజిత్‌ బోస్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఇక్కడో సమస్య ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము అందుకున్న నిధులను పర్యావరణ మార్పులు తదితరాలను ఎదుర్కొనేందుకు ఖర్చుచేస్తాయి. గ్రాంట్స్‌గా కాకుండా రుణాలు, పెట్టుబడుల రూపంలో ఈ నిధుల్ని అందుకుంటాయి. వీటిని తిరిగి చెల్లించాలి. కానీ ఆ దేశాలకు ఆ స్తోమత ఉండదు. దీంతో ఈ దేశాలను ఆదుకునేందుకు సంపన్న దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. 2011–20కాలంలో ఇలాంటి దేశాలకు కేవలం 5 శాతం నిధులే దక్కాయి. ఈ నేపథ్యంలో గత వాగ్దానాలు, తీర్మానాలకు కట్టుబడేలా ఈసారైనా జీ20 దేశాలు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటాయో లేదో చూడాలి. 

మరిన్ని వార్తలు