భారత్‌ స్వరం మరింత బలపడుతోంది

13 Oct, 2023 01:14 IST|Sakshi
కైలాస శిఖరంపై ధ్యాన ముద్రలో ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌ ర్యాలీలో ప్రధాని మోదీ

పితోర్‌గఢ్‌: సవాళ్లతోనిండిన ప్రపంచంలో భారత్‌ వాణి మరింత బలపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్‌ సత్తా చాటుకుందని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు వంటి గత 30, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై సైతం తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

చంద్రయాన్‌–3 మిషన్‌ విజయవంతమైందని తెలిపిన ప్రధాని మోదీ, చంద్రుడిపై వేరే ఏ దేశమూ చేరుకోని ప్రాంతంలోకి మనం వెళ్లగలిగామన్నారు. ‘ఒక సమయంలో దేశంలో నిరాశానిస్పృహలు ఆవరించి ఉండేవి. వేల కోట్ల రూపాయల కుంభకోణాల చీకట్ల నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందా అని ప్రజలు ప్రార్థించేవారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి.

వెనుకబడిన ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల ప్రజలు వలస బాట పట్టారు. పరిస్థితులు మారి అలా వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు’అని ప్రధాని చెప్పారు. ‘ప్రపంచమంతటా సవాళ్లు నిండి ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్‌ వాణి గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచానికే భారత్‌ మార్గదర్శిగా మారడం మీకు గర్వకారణం కాదా? ఈ మార్పు మోదీ తీసుకువచ్చింది కాదు.

రెండోసారి మళ్లీ అధికారం అప్పగించిన 140 కోట్ల దేశ ప్రజలది’అని ప్రధాని అన్నారు. గత అయిదేళ్లలో 13.50 కోట్ల ప్రజలను పేదరికం నుంచి తమ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చిందన్నారు. పేదరికాన్ని అధిగమించగలమని దేశం నిరూపించిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌ ప్రజలు తనను కుటుంబసభ్యునిగా భావించారని చెప్పారు. రూ.4,200 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. 

ఆదికైలాస శిఖరంపై ప్రధాని ధ్యానం
అంతకుముందు, రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం జోలింగ్‌కాంగ్‌ చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఘన స్వాగతం పలికారు. జోలింగ్‌కాంగ్‌లోని పార్వతీ కుండ్‌ వద్ద ఉన్న శివపార్వతీ ఆలయంలో ఆరతిచ్చి, శంఖం ఊదారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని పరమేశ్వరుని నివాసంగా భావించే ఆది కైలాస పర్వత శిఖరాన్ని సందర్శించుకున్నారు.

అక్కడ కాసేపు ధ్యానముద్రలో గడిపారు. అనంతరం అక్కడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామం గుంజికి చేరుకున్నారు. అక్కడి మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. స్థానికులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. ఉన్ని దుస్తులు, కళారూపాలతో ఏర్పాటైన ప్రదర్శనను తిలకించారు. భద్రతా సిబ్బందితోనూ ప్రధాని ముచ్చటించారు. అక్కడ్నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్మోరా జిల్లాలో పురాతన శివాలయం జగదేశ్వర్‌ ధామ్‌కు వెళ్లారు. అక్కడున్న జ్యోతిర్లింగానికి ప్రదక్షిణలు, పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రధాని పితోర్‌గఢ్‌కు చేరుకున్నారు. 

అత్యల్పానికి నిరుద్యోగిత: మోదీ 
న్యూఢిల్లీ: నానాటికీ దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత గత ఆరేళ్లలో అతి తక్కువగా నమోదైందని తెలిపారు. తాజాగా జరిపిన ఓ సర్వేలో ఈ మేరకు తేలిందని వివరించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ శాఖ కౌశల్‌ దీక్షాంత్‌ సమారోహ్‌ను ఉద్దేశించి గురువారం ఆయన వీడియో సందేశమిచ్చారు.

భారత్‌లో కొన్నేళ్లుగా ఉపాధి కల్పన కొత్త శిఖరాలకు చేరుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగిత బాగా తగ్గుముఖం పడుతోంది. అభివృద్ధి ఫలాలు పల్లెలను చేరుతున్నాయనేందుకు ఇది నిదర్శనం. ప్రగతిలో అవిప్పుడు పట్టణాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. అంతేకాదు, పనిచేసే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుండటం మరో సానుకూల పరిణామం. ఇదంతా మహిళా సాధికారత దిశగా కొన్నేళ్లుగా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల పర్యవసానమే’’ అని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు