Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం

12 Oct, 2023 00:32 IST|Sakshi
జి–20 ప్రతినిధులకు భారతీయ సంస్కృతి, కళలు, చిరుధాన్యాల పంటల గురించి వివరిస్తున్న విశాలరెడ్డి

ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్‌ బాక్స్‌ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్‌ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు.

విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె.

‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్‌... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్‌కి వెళ్లడానికి ఒక సైకిల్‌ కొనిపించుకోగలిగారామె.

ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్‌కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్‌లతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్‌ డిస్‌కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ డిస్టెన్స్‌లో బీఏ చేశారు.

అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్‌కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె.

 హైదరాబాద్‌ నిలబెట్టింది!
‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్‌లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్‌ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్‌ ఇండస్ట్రీస్‌ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్‌ భాష మీద పట్టుకోసం బ్రిటిష్‌ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్‌లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను.

నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్‌లో రహగిరి డే, కార్‌ ఫ్రీ డే, వన్‌ లాక్‌ హ్యాండ్స్‌ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్‌ చేయడంలో భాగంగా హైదరాబాద్‌ని మార్కెట్‌ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్‌ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్‌ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి.

అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్‌ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్‌ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్‌ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను.
 
ఊరు కొత్త దారిలో నడిపించింది!
నా మిల్లెట్‌ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్‌ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్‌ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్‌ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్‌గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్‌ బ్యాంక్‌.

ఈ బ్యాంక్‌ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్‌ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్‌ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్‌ బాక్స్‌ తయారు చేశాను.

ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్‌ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్‌లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్‌ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్‌ బాక్స్‌లు, సీడ్‌ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్‌ బ్యాంకు, సీడ్‌ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. 

స్త్రీ ‘శక్తి’కి పురస్కారం
టీసీఈఐ (తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్‌ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్‌ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం.

పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్‌లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్‌ స్టాండింగ్‌ ఉమెన్‌ లీడర్స్‌ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది.
– విశాల రెడ్డి ఉయ్యాల
 ఫౌండర్, మిల్లెట్‌ బ్యాంకు

 

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: ఎస్‌. ఎస్‌. ఠాకూర్‌

మరిన్ని వార్తలు