విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు.. వీడియో వైరల్..

15 Aug, 2023 20:03 IST|Sakshi

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు.

కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం ‍అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు.

కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే.


    

మరిన్ని వార్తలు