Pegasus Spyware India Issue: మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనతో సీన్‌ మారింది

30 Jan, 2022 04:18 IST|Sakshi

‘‘ది బ్యాటిల్‌ ఫర్‌ ది వరల్డ్స్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సైబర్‌వెపన్‌’’ అనే టైటిల్‌తో న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన ఆ కథనంలో వివరాలు ఇలా ఉన్నాయి.  ‘‘ఇజ్రాయెల్‌కు చెందిన భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఒఓ గ్రూప్‌ గత దశాబ్దాకాలంగా పెగసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది. ఇది పని చేసినట్టు మరేది చేయలేదని వివిధ దేశాల పోలీసు, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలకు ఆ సంస్థ హామీలు గుప్పించింది.

ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు, ప్రైవేటు డిటెక్టివ్‌ కంపెనీలు కూడా చేయలేని పని ఈ పెగసస్‌ చేస్తుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్లను కూడా కనిపెట్టగలదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లినప్పుడు పెగసస్‌ స్పైవేర్‌పై ఒప్పందం కుదిరింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లడం అదే తొలిసారి. అంతకు ముందు దశాబ్దాలుగా పాలస్తీనాకు మద్దతుగానే భారత్‌ వ్యవహరించింది.

కానీ మోదీ పర్యటనలో అప్పటి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో అత్యంత సుహృద్భావ వాతావరణం మధ్య చర్చలు జరిగాయి.  నెతన్యాహూతో కలిసి మోదీ చెప్పులు లేకుండా మరీ స్థానిక బీచ్‌లో విహరించారు. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ, పెగసస్‌ స్పైవేర్‌ అన్నీ కలిసి ఒక ప్యాకేజీలా కొనుగోలు ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే నెతన్యాహూ ఆకస్మికంగా భారత్‌కు పర్యటించారు.

2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి పాలస్తీనాకు చెందిన మానవ హక్కుల సంస్థకు అబ్జర్వర్‌ స్టేటస్‌కు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు జరిగిన ఓటింగ్‌లో భారత్‌ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటు వేసింది. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్‌కు భారత్‌ మద్దతునివ్వడం అదే తొలిసారి. అమెరికాకు చెందిన ఎఫ్‌బిఐ కూడా పెగసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎవరి మీద వినియోగించకూడదని నిర్ణయించింది.

2011లో ఇజ్రాయెల్‌ ప్రపంచ మార్కెట్‌లో పెగసస్‌ని ప్రవేశపెట్టిన తర్వాత పలు యూరప్‌ దేశాలు ఉగ్రవాదుల ఉనికి కనిపెట్టడానికి దీనిని వినియోగించాయి. ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు దగ్గర అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని డీక్రిప్ట్‌ (డీకోడ్‌) చేయగలిగే సామర్థ్యం పెగసస్‌కి ఉండటంతో విధ్వంసకారుల గుట్లు తెలిసేవి. కానీ దీనిని కొనుగోలు చేసిన దేశాలు హక్కుల సంఘాలపై కూడా ప్రయోగించాయి. జర్నలిస్టులు, రాజకీయ అసమ్మతివాదులపైనా మెక్సికో ప్రయోగిస్తే,  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పౌర హక్కుల కార్యకర్తలపైనా, సౌదీ అరేబియా మహిళా హక్కుల కార్యకర్తలపైనా నిఘాను ఉంచాయి.

  ఈ స్పైవేర్‌ ఇలా దుర్వినియోగమడం వివాదాస్పదం కావడంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దీనిపై గత ఏడాది జులైలో విచారణకు ఒక కమిటీ వేసింది. దీనిపై ఎన్‌ఎస్‌ఒ ఆనాటి చీఫ్‌ షాలెవ్‌ హులియో ఇజ్రాయెల్‌ సైబర్‌ పరిశ్రమపైనే బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఈ వివాదం నుంచి  దూరంగా జరిగింది. స్పైవేర్‌ని రూపొందించిన ఎన్‌ఎస్‌ఒ ప్రైవేటు సంస్థ కాబట్టి ఇజ్రాయెల్‌ ప్రభుత్వ విధానాలు ఆ సంస్థకి వర్తించవని తప్పించుకుంది. దీంతో అమెరికా ప్రభుత్వం ఆ సంస్థపై ఆంక్షలు విధించింది’’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ ఆ కథనాన్ని ముగించింది.

మరిన్ని వార్తలు