Covid-19 News: 227 రోజుల తరువాత భారీగా కరోనా కేసులు

31 Dec, 2023 13:04 IST|Sakshi

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 10 రోజుల డేటాను పరిశీలిస్తే, రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం (డిసెంబర్ 31) ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన గణాంకాలు మరింత భయం గొలిపేవిగా ఉన్నాయి. 

గడచిన 24 గంటల్లో దేశంలో  కొత్తగా 841 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇవి 227 రోజుల తరువాత అత్యధికంగా నమోదైన కేసులు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది. అంతకుముందు మే 19న 865 కేసులు నమోదయ్యాయి.

గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా బాధితులు కన్నుమూశారు. కరోనాలోని కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే వైరస్‌ సోకిన వారిలో చాలా మంది కోలుకోవడం ఉపశమనం కలిగించే అంశమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వైరస్‌ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు 98.81 శాతం. కాగా దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా ‍వ్యాక్సిన్‌ డోస్‌లు అందించారు. కాగా కొన్ని నివేదికల ప్రకారం బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా జేఎన్‌.1 సోకినట్లు సమాచారం. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: 2023లో ‘ఉదయ్‌పూర్‌’ ఎందుకు మారుమోగింది?

>
మరిన్ని వార్తలు