చైతన్య భారతి: అణకువ కలిగినవాడు.. ఇనాయతుల్లా అల్‌ మష్రికి

10 Aug, 2022 13:51 IST|Sakshi

1888–1963

భారత స్వాతంత్య్ర సమరంలో జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్, గదర్‌ పార్టీ, హిందూ మహాసభ, స్వరాజ్య పార్టీ హిందుస్తాన్‌ సోషలిస్ట్‌ రిపబ్లికన్‌  ఆర్మీ వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటిదే ఖక్సర్‌ తెహ్రీక్‌. ఖక్సర్‌ అంటే అర్థం అణకువ కలిగినవాడు. నలభై లక్షల సభ్యత్వంతో (1942 నాటికి), దేశంలోను, విదేశాలలో కూడా శాఖలు నెలకొల్పింది. దీని మీద గట్టి నిర్బంధం ఉండేది.

బ్రిటిష్‌ ప్రభుత్వం అణచివేతే కాదు, మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని అఖిల భారతీయ ముస్లిం లీగ్‌ కూడా ఖక్సర్‌ను పరమ శత్రువులాగే చూసింది. లాహోర్‌ కేంద్రంగా ఉద్యమించిన ఈ ఖక్సర్‌ తెహ్రీక్‌ను 1931లో అల్లామా ఇనాయతుల్లా అల్‌ మష్రికి స్థాపించారు. సంస్థ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండడమే కాదు, సభ్యులు ఉద్యమానికి సమయం ఇవ్వడంతో పాటు, దేశం కోసం ఎవరి వ్యయం వారే భరించాలి.

అచ్చంగా బ్రిటిష్‌ పోలీసుల యూనిఫామ్‌ను పోలి ఉన్న దుస్తులు ధరించేవారు. దాని మీద సోదరత్వం అన్న నినాదం (ఉఖూవ్వాత్‌) ఉండేది. నాయకుడు సహా అంతా ఇదే ధరించేవారు. మష్రికి అనేకసార్లు కారాగారవాసం అనుభవించాడు. 1942 జనవరి 19 న వెల్లూరు జైలు నుంచి విడుదలచేసి మద్రాస్‌ ప్రెసిడెన్సీ దాటకూడదని ఆయనపై ఆంక్షలు విధించారు. సంస్కరణ, వ్యక్తి నిర్మాణం, దేశం కోసం త్యాగం ఖక్సర్‌ ఆశయాలు. ఇరుగు పొరుగులకు సేవ...  కార్యక్రమంలో అంతర్భాగం. ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులు అన్న భేదం లేదు.

పరిసరాలను శుభ్రం చేస్తూ, పేదలు, వృద్ధులు, రోగులకు సేవలు అందించాలి. మష్రికి ఇస్లామిక్‌ పండితులు, మేధావిగా గుర్తింపు పొందారు. అమృత్‌సర్‌కు చెందిన ముస్లిం రాజ్‌పుత్‌ కుటుంబంలో జన్మించిన మష్రికి కేంబ్రిడ్జ్‌ నుంచి గణితశాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. 1912లో స్వదేశం వచ్చి 25 ఏళ్లకే కళాశాల ప్రిన్సిపాల్‌ అయ్యారు. 29 ఏళ్లకి విద్యాశాఖ అండర్‌ సెక్రటరీ అయ్యారు. మష్రికి 1939లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు చేయడం ఆరంభించాడు.  దాంతో ఖక్సర్‌ ప్రమాదకరంగా తయారైందని పంజాబ్‌ గవర్నర్‌ హెన్రీ డఫీల్డ్‌ వైస్రాయ్‌ లిన్‌ లిత్‌గోకు నివేదిక పంపించాడు.

ఇలాంటి నివేదికే మధ్య పరగణాల నుంచి కూడా వెళ్లింది. ఓసారి ఢిల్లీలో ప్రసంగిస్తూ మష్రికి మీద జిన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మష్రికి ఒక ఉన్మాది అని వ్యాఖ్యానించారు. ఇదే బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఉపకరించింది. మష్రికితో మరింత కర్కశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆయన జీవితాంతం తన సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నారు. 75 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మర ణించారు. 

మరిన్ని వార్తలు