Vinayak Damodar Savarkar: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు

7 Jul, 2022 12:29 IST|Sakshi

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ స్వాతంత్య్ర సమరోద్యమ విప్లవకారులు. లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్‌ చంద్రపాల్‌ వంటి రాజకీయ నాయకుల నుంచి ప్రేరణ పొందినవారు. ఉపకార వేతనంపై న్యాయవిద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్‌ వెళ్లినప్పుడు ఆయన సహచరుడు చేసిన ఒక హత్య కేసు నుంచి తప్పించుకోడానికి ఇంగ్లండ్‌ నుంచి పారిస్‌కు మకాం మార్చారు. ఆ సమయంలోనే ఆయన జీవితంలో కొన్ని ముఖ్య ఘటనలు సంభవించాయి.

వాటిల్లో ఒకటి 1910 జూలై 7న సావర్కర్‌ తను ఉన్న ఓడ నుంచి సముద్రంలోకి దూకి తప్పించుకోవడం! భారత్‌లో వైస్రాయ్‌ని చంపడానికి బాంబుదాడి జరిగింది. అందులో సావర్కర్‌ సోదరుడు నారాయణ్‌ను అరెస్టు చేశారు. అలాగే లండన్‌లో ఉన్న సావర్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలని టెలిగ్రామ్‌ ఆదేశాలు వెళ్లాయి. అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ అయింది. 1910 మార్చిలో ఆయన పారిస్‌ నుంచి ఇంగ్లండ్‌ రాగానే పోలీసులు అరెస్టు చేసి బ్రిక్‌స్టన్‌  జైలుకు తరలించారు. కొంత తర్జనభర్జన తరువాత ఆయనను భారతదేశంలోనే విచారించాలని భావించారు. దీనితో ఎస్‌ఎస్‌ మోరియా అన్న నౌకలో జూలై 1న ఎక్కించారు.

ఏడో రోజుకు ఆ నౌక మార్సెల్స్‌ రాగానే సావర్కర్‌ సముద్రంలోంచి దూకి, తప్పించుకుని ఫ్రెంచ్‌ భూభాగం మీద అడుగు పెట్టారు. అయినా ఇంగ్లండ్‌ పోలీసులు మళ్లీ పట్టుకుని తీసుకుపోయారు. ఈ చర్యను సావర్కర్‌ అభిమానులు  అంతర్జాతీయ కోర్టులో సవాలు చేశారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో బొంబాయి తీసుకువచ్చారు.  రెండు జీవితకాలాల శిక్ష పడింది. పైగా ప్రవాసం. ఇది అప్పట్లో అంతర్జాతీయ వార్త అయింది. ఒక మనిషికి యాభై ఏళ్లు శిక్ష ఏమిటన్నది అందరి విస్మయం.

మరిన్ని వార్తలు