జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌14 సక్సెస్‌

18 Feb, 2024 05:22 IST|Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా):  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. 27.30 గంటల అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్‌ ప్రయోగం చేపట్టారు.

ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి. 2,275 కిలోల బరువు కలిగిన ఇన్‌శాట్‌–3డీఎస్‌ సమాచార ఉపగ్రహాన్ని  భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు(పెరిజీ), భూమికి దూరంగా 36,647 కిలోమీటర్ల(అపోజీ) జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఇన్‌శాట్‌–3డీఎస్‌లో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి, మరో రెండు మూడు రోజుల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్‌(భూ స్థిరకక్ష్య)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు.  

ఏమిటీ ఇన్‌శాట్‌–3డీఎస్‌?  
దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్‌శాట్‌–3, ఇన్‌శాట్‌–3ఆర్‌ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్‌శాట్‌–3డీఎస్‌ ఉపగ్రహం పని చేస్తుంది. ఇప్పటిదాకా ఇన్‌శాట్‌ శ్రేణిలో 23 ఉపగ్రహాలను ప్రయోగించారు.

ఇన్‌శాట్‌–3డీ, ఇన్‌శాట్‌–3డీఆర్‌ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్‌శాట్‌–3డీఎస్‌ని అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు చానెల్‌ ఇమేజర్స్, 19 చానెల్‌ సౌండర్స్‌తోపాటు మెట్రోలాజికల్‌ పేలోడ్స్, కమ్యూనికేషన్‌ పేలోడ్స్‌ను అమర్చారు. వాతావరణ పరిశీలనతోపాటు భూమి, సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది.  

త్వరలో నిస్సార్‌ ప్రయోగం: సోమనాథ్‌  
నాసా–ఇస్రో సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌(నిస్సార్‌) మిషన్‌ అనే జాయింట్‌ ఆపరేషన్‌ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్‌లో జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ చెప్పారు.  పీఎస్‌ఎల్‌వీ–సీ59, ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డి3, జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌15 ప్రయోగాలతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఆర్‌ఎల్‌వీ–టీడీ–2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు