Jharkhand politics 2024: సీఎంగా చంపయ్‌ ప్రమాణం

3 Feb, 2024 05:07 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) శాసనసభాపక్ష నేత చంపయ్‌ సోరెన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అలంగీర్‌ అలాం, రాష్రీ్టయ జనతాదళ్‌(ఆర్జేడీ) నేత సత్యానంద్‌ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయ్‌ సోరెన్‌ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్‌ సోరెన్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్‌ సోరెన్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్‌ సోరెన్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు.   

హైదరాబాద్‌ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు  
జార్ఖండ్‌ సీఎంగా చంపయ్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పాలిత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలపై విపక్ష బీజేపీ వల విసిరే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా వారిని బయటకు తరలించినట్లు కూటమి నేతలు చెప్పారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో చంపయ్‌ సోరెన్‌

whatsapp channel

మరిన్ని వార్తలు