Karnataka Assembly Elections 2023: సీఎం కారును అడ్డగించిన అధికారులు.. ఆకస్మిక తనిఖీలు

31 Mar, 2023 18:52 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రయాణిస్తున్న కారును ఎన్నికల సంఘం అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆలయానికి వెళ్తుండగా బొమ్మై వాహనాన్ని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆపింది. సీఎం కారులో కారులో తనిఖీలు చేపట్టింది. బొమ్మై కారును అధికారులు తనిఖీ చేస్తన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడదలవ్వడంతో  ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ క్రమంలో బొమ్మై తన అధికారిక వాహనాన్ని అధికారులకు సరెండర్‌ చేశారు. శుక్రవారం ఓ ప్రైవేటు కారులో ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయానికి వెళ్తుండగా హోసహుద్య చెక్‌పోస్టు వద్ద అధికారులు ఆపారు. అయితే బొమ్మై కారులో అభ్యంతరకరమైనవేవి గుర్తించలేదని అధికారులు తెలిపారు. సాధారణ తనిఖీ అనంతరం ఆయన వాహనం వెళ్ళడానికి అనుమతించినట్లు పేర్కొన్నారు. 

కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను బుధవారం ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 10న ఎన్నికలు జరుగనుండగా.. మే 13న కౌంటింగ్ ఉండనుంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా, బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు